ఉచిత న్యాయ సేవలు అందించడమే న్యాయ సేవాధికార సంస్థ ధ్యేయమని, రాజ్యాంగం కల్పించిన ఉచిత న్యాయ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని 9వ. అదనపు జిల్లా సెషన్స్ జడ్జి, చైర్మన్ బి.శ్రీనివాసులు సూచించారు.
స్వాతంత్య్రం సిద్దించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం “ఆజాది కా అమృత్ మహోత్సవ్” పేరిట వివిధ విభాగాల ద్వారా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని ఆయన తెలిపారు.
అందులో భాగంగా న్యాయ సేవలు గ్రామ గ్రామాన అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో న్యాయ సేవా సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. శనివారం వనపర్తి ఆర్టీసీ కాలనీలోని యాదవ భవన్ లో “ఉచిత న్యాయ సేవల అవగాహన”పై ఏర్పాటు చేసిన పాన్ ఇండియా అవేర్ నెస్ కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నిరుపేదలకు న్యాయం అందించాలని రాజ్యాంగం మనకు హక్కు కల్పించిందని, ఇది గ్రామా స్థాయి ప్రజలకు తెలియక న్యాయం పొందలేకపోతున్నారని, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు న్యాయాధికార సంస్థ ద్వారా అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పటి వరకు 45 రోజులలో 374 క్యాంపులను నిర్వహించినట్లు ఆయన సూచించారు.
జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్ మాట్లాడుతూ 45 రోజులపాటు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టి, ప్రజల్లో ఉన్న అపోహలు తొలగిపోయి ప్రభుత్వం తరపున ఉచిత న్యాయ సేవలు అందుబాటులో ఉంటాయని వారికి తెలియజేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ అవగాహన కార్యక్రమాలు నవంబర్ 14వ తేదీతో ముగియనున్న ట్లు ఆయన తెలిపారు.
డీఎస్పీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ పిలుపు మేరకు మండల స్థాయిలో అధికారులు గ్రామ గ్రామాన 45 రోజులపాటు, లక్ష్యానికి 70 నుండి 80 శాతం అవగాహన కార్యక్రమాలు చేపట్టి, బాధితులకు ఉచిత న్యాయ సేవలపై అవగాహన కల్పించినట్లు ఆయన సూచించారు. అనంతరం చైల్డ్ లైన్ కు సంబంధించిన గోడ పత్రికను విడుదల చేశారు. న్యాయ అవగాహన సదస్సు వీడ్కోలు సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి కిరణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు నాగేశ్వర్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.చంద్రశేఖర రావు, జిల్లా అధికారులు, న్యాయ వాదులు, అంగన్వాడీ టీచర్లు, సఖి అధికారులు, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు