Friday, November 22, 2024

ఉచితంగా మోకాలిచిప్ప మార్పిడి.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఆపరేషన్లు జరగాలి: హరీష్‌రావు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్‌ సేవలు అందించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 56 సీఆర్మ్‌ మిషన్లు ఏర్పాటు చేశామని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే జరగేలా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అందిస్తున్న ఆర్థోపెడిక్‌ సేవలపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో ఆదివారంనాడు మంత్రి హరీష్‌రావు సమీక్షించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ, ప్రముఖ ప్రైవేట్‌ ఆర్థోపెడిక్‌ వైద్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో అందుతున్న ఆర్థోపెడిక్‌ వైద్య సేవలపై ఆరాతీశారు. తెలంగాణలో ఆర్థోపెడిక్‌ వైద్య సేవలను మెరుగుపరచటంపై సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలకు మెరుగైన ఆర్థోమెడిక్‌ వైద్య సేవలందించేలా చూడాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ ఎంఎస్‌ ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డిని ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రుల అభివృద్ధికి నిధులు విడుదల చేసిందన్నారు. ఆయా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు ఈ నిధులను వినియోగించుకొని.. రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. ప్రైవేట్‌ హాస్పిటల్స్‌తో పోటీ పడి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఆర్థోపెడిక్‌ వైద్యసేవలు అందించాలని, మోకాలి చిప్ప మార్పిడి సర్జరీకి కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమకూర్చామన్నారు. ఆస్పత్రుల సూపరింటెండెంట్స్‌ ఆర్థోపెడిక్‌ వైద్యులకు సహకారం అందించాలని, అన్ని రకాల ఆర్థో చికిత్సలను ఆరోగ్యశ్రీ పథకం కింద అందించే అవకాశం ఉందని గుర్తు చేశారు. పేదలకు అన్నిరకాల వైద్యం ఉచితంగా అందించే బాధ్యత ప్రభుత్వంతో పాటు వైద్యులది కూడా అని స్పష్టం చేశారు.

సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ శాఖ కార్యదర్శి రిజ్వి, టీఎస్‌ ఎంఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, డీఎంఈ రమేశ్‌రెడ్డి, నిమ్స్‌, రిమ్స్‌, మహబూబ్‌నగర్‌, సిద్దిపేట దవాఖానాల డైరెక్టర్లు, టీఎస్‌ ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేకర్‌రెడ్డి, అన్ని మెడికల్‌ కాలేజీ హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్థోపెడిక్‌ యూనిట్ హెచ్‌వోడీలు, ఆర్థోపెడిక్‌ డాక్టర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, జిల్లా ఆస్పత్రి ఆర్థోపెడిక్‌ డాక్టర్లు పాల్గొన్నారు. ప్రైవేటు ఆస్పతులకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యులు గురువారెడ్డి, అఖిల్‌ దాడి, సూర్య ప్రకాశ్‌, నితిన్‌, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement