తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గృహజ్యోతి పథకానికి అద్దెకుండే వారు కూడా అర్హులేనని, వారికి కూడా 200 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమేనని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం) వివరణ ఇచ్చింది. ఇంట్లో అద్దెకున్న వారికి ఈ పథకం వర్తించదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంపై డిస్కం స్పందించింది. ఆ వార్తలేవీ నిజం కాదని పేర్కొంది. గత నెలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఉచిత విద్యుత్ పథకానికి దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే.
అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకూ ఈ పథకానికి సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో ఎవరు అర్హులు.. ఎవరు అనర్హులనే విషయంపై స్పష్టత కొరవడింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయంపై డిస్కం కొంత స్పష్టతనిచ్చే ప్రయత్నం చేసింది. ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు విడుదల చేయలేదని తెలిపింది.