హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైల్వేలో ఉద్యోగాలు, ఉద్యోగ అవకాశాల పేరితో చేసే మోసాలకు వ్యతిరేకంగా యువతకు అవగాహన కల్పిస్తోంది రైల్వే డిపార్ట్మెంట్. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో ” గ్రామ సభ ” పేరుతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ మేరకు దమ రైల్వే పరిధిలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తిమ్మాపూర్ రైల్వే స్టేషన్లో గ్రామ సభను నిర్వహించారు. హైదరాబాద్ డివిజన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ద.మ రైల్వే అదనపు డివిజినల్ రైల్వే మేనేజర్ పి. కోటేశ్వర రావు మాట్లాడుతూ ఉద్యోగావకాశాలు కల్పిస్తామనే మోసగాళ్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలన్నారు.
రైల్వేలో నియమకాలు అత్యంత పారదర్శకంగా జరుగుతాయని, డబ్బులకు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తప్పుడు వాగ్ధానాలతో ఆకర్షిస్తున్న మధ్య దళారులను నమ్మవద్దని యువతను కోరారు. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారులు ఇతర సిబ్బంది మాట్లాడుతూ యువతలో స్పూర్తిని నింపేందుకు ఎంపిక ప్రక్రియలో పాటించే పారదర్శకతతో పాటు వారి అనుభవాలను పంచుకున్నారు. మోసగాళ్లు రైల్వే అధికారులుగా నటించి ఉద్యోగాలు ఇప్పిస్తామని వాగ్ధానాలు చేసే వారి పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అవినీతి నిర్మూలన అంశంపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.