Saturday, November 23, 2024

పైసలు డబుల్ చేసే బాబాలు.. 50 వేలను 80వేలు చేస్తరట..

ఉమ్మడి ఆదిలాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : అమాయకుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారీగా నగదు కాజేసిన నకిలీ బాబాల వ్యవహారాన్ని ఆదిలాబాద్‌ పోలీసులు గుట్టు రట్టు చేశారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారివద్ద నుంచి రూ. 11.70 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎం రాజేష్‌ చంద్ర మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశంలో వివ రాలు వెల్లడించారు. నకిలీ బాబాలను విలేకరుల ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నకిలీ బాబాల సంచలన కేసు దర్యాప్తు బాధ్యత టాస్క్‌ ఫోర్స్‌కు అప్పగించడంతో రంగంలోకి దిగిన సిఐ ఈ చంద్రమౌళి, ఎఎస్సై సయ్యద్‌ తాజుద్దీన్‌ నిఘా పెంచడంతో విశ్వసనీయ సమాచారం మేరకు మంగళవారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో గాంధీ నగర్‌ కాలనీలోని ఇంట్లో నిందితులు ఉన్నట్లు తెలుసుకుని అదుపులో తీసుకున్నట్లు తెలిపారు. అరె స్టయిన నిందితుల్లో ఉట్నూర్‌ మండలం శ్యాంపూర్‌ గ్రామానికి చెందిన గోటుముక్లే సుగ్రీవ్‌ (30) ఆదిలా బాద్‌ గాంధీ నగర్‌ కాలనీకి చెందిన బాల్‌ శంకర్‌ సంగీత (40) ఇరువురు కలిసి కూరగాయల వ్యాపారం చేస్తుం డేవారు. ఆదాయం సరిపోకపోడంతో బాబాల అవతా రం ఎత్తి నగదును రెట్టింపు చేస్తామని నమ్మించి అమాయకులను మోసం చేయడానికి కుట్రపన్నారని తెలిపారు. ఈక్రమంలో జూన్‌ 15న న్యూహౌసింగ్‌ బోర్డు కాలనీలోని ఫిర్యాదు మహ్మద్‌ ఫారుక్‌ ఇంటికి వెళ్లి మంత్ర తంత్రాలతో హోమం చేసి నగదును రెట్టింపు చేస్తామని నమ్మించి మొదటిసారిగా రూ. 50 వేలను హోమంలో ఉంచి మంత్రాలతో 80 వేలుగా మార్చినట్లు నమ్మించారు. తద్వారా ఫిర్యాదు చెల్లెలికి చెందిన లక్ష రూపాయలను లక్షన్నరగా మార్చినట్లు మరింత నమ్మించడంతో ఫిర్యాదుదారులు ఏకంగా రూ. 29 లక్షలను రెట్టింపు చేయాలని నిందితులకు నగదును అందజేశారు. ఇదే అదునుగా నిందితులు హోమం చేసినట్లు నటించి ఓ మూటను వారికి ఇచ్చి రెండు రోజుల తర్వాత తీసి చూడాలని నమ్మించి నగదును తీసుకుని పరారయ్యా రని తెలిపారు. రెండు రోజుల తరువాత మూట విప్పి చూసి నగదు తక్కువ గా ఉండడంతో తాము మోస పోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించి వారి వద్ద రూ. 11 లక్షల70వేల నగదు రూ. 20వేల విలువైన రెండుసెల్‌ఫోన్‌లు , రూ. 60వేల విలువైన ల్యాప్‌టాప్‌ రూ. 20 వేల విలువైన రెండు బంగారు పూత పూసిన గాజులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను విచారించగా స్థానిక ముత్తూట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో మూడు తులాల బంగారు గాజులు కుదువ పెట్టినట్లు వివరించారు. నిందితులను అరెస్టు చేసి న్యాయసస్థానంలో ప్రవేశ పెడుతామని మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి నిందితులను పోలీసు కస్టడీకి తీసుకునేందుకు న్యాయమూర్తికి అభ్యర్థన చేస్తామని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement