Thursday, November 21, 2024

బాలికల సంరక్షణకు ఫోక్సో కోర్టులు.. జడ్జి రాజ్ కుమార్

తొర్రూరు, (ప్రభ న్యూస్): చిన్నారులపై అఘాయిత్యాలను నిలువరించేందుకు, బాలికల సంరక్షణకు పోక్సో కోర్టులు ఏర్పడ్డాయని తొర్రూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం డివిజన్ కేంద్రంలోని సంక్షేమ బాలికల గురుకులంలో న్యాయ చైతన్య అవగాహన కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. జడ్జి రాజ్ కుమార్ మాజీ దేశ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

విద్యార్థినులకు లైంగిక వేధింపుల నిరోధక చట్టం, ర్యాగింగ్ నిరోధక చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, వరకట్న నిషేధ చట్టం, నిర్భయ చట్టం తదితర న్యాయ చట్టాలపై జడ్జి ,న్యాయవాదులు అవగాహన కల్పించారు. బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జి. జయశ్రీ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జడ్జి రాజ్ కుమార్ మాట్లాడుతూ మహిళ, పురుషుల మధ్య అసమానతలు తగ్గించి బాలికలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరాక్షరాస్యత కారణంగా ఇంకా బాల్య వివాహాలు జరగడం బాధాకరమన్నారు.బాలికలు విద్య ద్వారానే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తారని అన్నారు.భారత రాజ్యాంగం మహిళలు, బాలికల కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించిందన్నారు.

ఎడ్యుకేషన్‌, హెల్త్‌, బిజినెస్‌, క్రీడలు వంటి రంగాల్లో మహిళలు తమ పాత్రను అద్భుతంగా నిర్వర్తిస్తున్నట్లు చెప్పారు. దేశానికి క్రీడల్లో అధికంగా పతకాలు తీసుకొచ్చిన ఘనత ఆడబిడ్డలేదేనని అన్నారు. ప్రతి అవకాశంలో బాలికలకు సమాన హక్కులు ఉండాలని, బాలికల విద్య, వైద్యం, పౌష్టికాహారంతో పాటు సామాజిక ఎదుగుదలకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. నృత్యం, పాటల పోటీల్లో విజేతగా నిలిచిన విద్యార్థినులకు జడ్జి చేతుల మీదుగా బహుమతులు అందించారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లపు మహేష్, న్యాయవాదులు వెంకన్న, రఘురాం రెడ్డి, అశోక్ ,నాగేశ్వర్, భాస్కర్, యాకాంబ్రం, ఉపాధ్యాయులు సంధ్య, మమత, మౌనిక, సునీత, శోభ ,మాధవి, ఆసియా తన్వీన్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement