సీసీ కెమెరాల ఆధారంగా దొంగల పట్టివేత
జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్
వేములవాడ, జులై 13 (ప్రభ న్యూస్): ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బుల కోసం ట్రాక్టర్ దొంగతనానికి పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పర్కొన్నారు. శనివారం వేములవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. బోయినపల్లి మండలం వరదవెల్లికి చెందిన మందల సాయి, మందల వెంకటేశ్, మందల వంశీలతో పాటు నిర్మల్ జిల్లా లోకేశ్వర్ మండలం మెహాలాకు చెందిన గంజాయి పోశెట్టిలు కలిసి ట్రాక్టర్ దొంగతానికి పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. సాయి, వెంకటేశ్, వంశీలు ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బులు సరిపోక పోవడంతో దొంగతనం చేశారని తెలిపారు. బోయినపల్లి మండలం రాజన్నపేటకు చెందిన ఈడుగు కనుకయ్య తన పొలంలో దున్నటానికి ట్రాక్టర్‌ను పెట్టుకోగా, గమనించిన ముగ్గురు ట్రాక్టర్‌ను దొంగిలించి విక్రయించాలని భావించారన్నారు.
రాత్రి సమయంలో ఎవరూ లేకుండా చూసి ట్రాక్టర్‌కు ఉన్న కేజీ వీల్స్‌ను అక్కడే వదిలేసి కల్టీవేటర్‌తో సహ దొంగలించుకుని పారిపోయారారన్నారు. బాధితుడు ఈడుగు కనుకయ్య ఈనెల 2న బోయినపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి ఆధ్వర్యంలో సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుళ్లు కోటేశ్వర్, తిరుపతిలతో టీం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధారంగా ఆధారాలు కనుగొన్నామన్నారు. ట్రాక్టర్‌ను రాజన్నపేట నుంచి దేశాయిపల్లి, రత్నంపేట, గుండన్నపల్లి, కోరెం, వట్టెంల, నూకలమర్రి, నర్సింగాపూర్, మల్యాల, లింగన్నపేట, మానాల, భీమ్‌ఘల్, ఆర్మూర్‌తోపాటు వివిధ గ్రామాల మీదుగా లోకేశ్వరం మండలంలోని మోడెం గ్రామానికి చేరుకొని అదే గ్రామానికి చెందిన గంజాయి పోశెట్టికి అమ్మినిట్లు గుర్తించామన్నారు.
నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 4.50లక్షల విలువ గల జాన్ డీర్ ట్రాక్టర్, కల్టివేటర్‌తో పాటు ఓ కారు, ద్విచక్ర వాహనం, 5 మొబైల్ ఫోన్లలను స్వాధీనం చేసుకొని రిమాండ్‌కి తరలించామన్నారు. దొంగలను పట్టు-కోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ పృథ్వీధర్ గౌడ్, కానిస్టేబుల్ కొటేశ్వర్, తిరుపతిలను అభినందించి రివార్డు అందజేశారు. ఎస్పీ వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిఐ శ్రీనివాస్, ఎస్‌ఐ పృథ్వీధర్ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.