తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నేతల హామీలు ప్రజలను అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ఓ పార్టీ ఒక్క హామీ ఇస్తే.. ప్రత్యర్థి పార్టీ దానికి రెట్టింపుగా ఇస్తామంటూ నేతలు హామీలిస్తున్నాయి. సామాన్యులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా పార్టీలు ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాయి. అయితే తాజాగా.. ఓ పార్టీ అభ్యర్థి తనను గెలిపిస్తే విద్య, వైద్యం, న్యాయ సేవలు.. ఇలా ఏదైనా సరే రూపాయికే అందిస్తానని ఓ అభ్యర్థి హామీ ఇస్తున్నాడు. రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని చెబుతున్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం ప్రత్యేక పథకమూ ప్రకటించాడు. ప్రతీ వంద ఇండ్లకు ఓ వాలంటీర్ ను నియమిస్తానని, ఇంట్లో అమర్చిన పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సేవలందించే ఏర్పాట్లు చేస్తానని చెబుతున్నాడు. మిగతా పార్టీల అభ్యర్థులను ఓడించి తనను గెలిపిస్తే ఈ హామీలన్నీ అమలు చేస్తానని అంటున్నాడు. ఆయనే.. సనత్ నగర్ నియోజకవర్గ బరిలో ఉన్న కుమ్మరి వెంకటేశ్ యాదవ్. ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై కుమ్మరి వెంకటేశ్ యాదవ్ సనత్ నగర్ బరిలో నిలిచాడు.
ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఉన్నత విద్యావంతురాలు, డాక్టర్ కోట నీలిమ పోటీ చేస్తున్నారు. వీరితో పోటీపడుతున్న వెంకటేశ్.. వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ ధరను ప్రధాన పార్టీలు పోటాపోటీగా తగ్గిస్తుంటే.. ఇక ఇంతకుమించి తగ్గించలేరనేలా ఏకంగా రూపాయికే నాలుగు సిలిండర్లు అందిస్తానని ప్రకటించాడు. అసాధ్యమైన హామీలతో కుమ్మరి వెంకటేశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు. కూటి కోసం కోటి విద్యలన్నట్లు.. ఓట్ల కోసం నేతలు ఇలా కీలక హామీలు ఇస్తున్నారు.