Saturday, November 23, 2024

ప్రభుత్వ విప్‌పై దుష్ప్రచారం చేసిన నలుగురి అరెస్టు

వరంగల్‌, (ప్రభన్యూస్‌): రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌పై దుష్ప్రచారం చేసిన నలుగురు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసినట్లు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తరుణ్‌ జోషి తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ హుజురాబాద్‌ ఉప ఎన్నికలో భాగంగా కమలాపూర్‌ మండల కేంద్రానికి చెందిన బైరి దశరథం తెరాస పార్టీ కార్యాలయానికి తన ఇంటిని అద్దెకిచ్చారని, దీనిని జీర్ణించుకోలేని బీజేపీ కార్యకర్తలు దశరథంపై కక్ష పెంచుకున్నారన్నారు. కమలాపూర్‌ మండలానికి పార్టీ ప్రచారం నిమిత్తం వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌కు సదరు దశరథం ఇంటి సభ్యుల మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు సందీప్‌ అనే బీజేపీ కార్యకర్త ఒక వీడియోను రూపొందించాడన్నారు. సదరు వీడియోను మిగతా ఆరుగురు నిందితులు బండి సదానందం, వడ్డె రమేశ్‌, వసంత్‌రావు, కడారి వెంకటేశ్‌, సునిల్‌ గౌడ్‌, లక్ష్మి వీరమల్లులతో కలిసి బాల్క సుమన్‌తోపాటు సదరు మహిళ వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచేలా హన్మకొండ జిల్లాతోపాటు హుజురాబాద్‌ వాట్స్‌యాప్‌ గ్రూపుల ద్వారా అసత్యప్రచారం చేశారన్నారు.

ఈ విషయం దశరథం దృష్టికి రావడంతో తన కుటుంబంపై జరుగుతున్న అసత్య ప్రచారంపై కమలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరంగల్‌ సీపీ ఆదేశాల మేరకు సెంట్రల్‌ జోన్‌ డీసీపీ పుష్పారెడ్డి, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్‌ల పర్యవేక్షణలో సైబర్‌ విభాగం సహకారంతో ఏడుగురు నిందితులను గుర్తించామన్నారు. ఇందులో సదానందం, వడ్డె రమేశ్‌, వసంత్‌రావు, వెంకటేశ్‌లను అదుపులోకి తీసుకొని నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. సందీప్‌ ఠాకూర్‌, సునిల్‌ గౌడ్‌, లక్ష్మి వీరమల్లు పరారీలో ఉన్నారని, త్వరలోనే వీరిని కూడా అదుపులోకి తీసుకుంటామని సీపీ తరుణ్‌ జోషి పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

https://twitter.com/AndhraPrabhaApphttps://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement