హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌కు సంబంధించిన వ్యహారంలో ఐఏఎస్ అరవింద్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం మంళవారం మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసుకు సంబంధించిన ఒప్పందంలోని కొన్ని అంశాలపై పూర్తి వివరణ ఇవ్వాలని అరవింద్ కుమార్‌కు ప్రభుత్వం మెమో ఇచ్చింది.
ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు నమోదు చేశారో తెలపాలని అరవింద్ కుమార్‌ను వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ప్రభుత్వ అనుమతి లేకుండా రూ. 54 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేశారని ఆరోపణలు అరవింద్ కుమార్‌పై ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను (రేస్ రౌండ్-4) రద్దు చేసినట్లు ఇటీవల ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్ ఈఓ) ప్రకటించింది. ఫిబ్రవరి 10వ తేదీన నెక్లెస్‌రోడ్డు స్ట్రీట్ సర్క్యూట్‌లో నిర్వహించవల్సిన ఈ అంతర్జాతీయ పోటీలపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఫార్ములా-ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఏర్పాటు చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘించిందని ఆరోపించడమే కాకుండా దీనిపై న్యాయపోరాటం చేస్తామని రేస్ నిర్వాహకులు ప్రకటించారు.