హైదరాబాద్ – ఫార్ములా ఈ-కార్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఈడీ విచారణకు హాజరయ్యారు.. ఈ సందర్బంగా ఈడీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.. కాగా కారు రేస్ స్కామ్ లో. కేటీఆర్ పై ఈడీ మనీ లాండరింగ్ కేసును నమోదు చేసింది. విచారణకు రావాల్సిందిగా కెటిఆర్ కు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన హాజరయ్యారు.. ఇక బిఆర్ ఎస్ శ్రేణులు కూడా ఈడీ కార్యాలయానికి భారీగా తరలివచ్చారు.. అయితే వారిని పోలీసులు లోపలకి రాకుండా నిలువరించారు..
ఇది ఇలా ఉంటే ఈ కేసుపై ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ… మంత్రిగా తాను తీసుకున్న అత్యంత ప్రతిష్ఠాత్మక నిర్ణయాల్లో హైదరాబాద్ ఈ-కార్ రేసు ఒకటని ఆయన పేర్కొన్నారు. ఆనాడు రేసర్లు అందరూ హైదరాబాద్ నగరాన్ని కీర్తించారని చెప్పారు. తనకు ఎప్పుడూ హైదరాబాద్ బ్రాండ్ ముఖ్యమని… కాంగ్రెస్ పెడుతున్న కేసులు ఆ ఘనతను తుడిచివేయలేవని అన్నారు.
రూ. 46 కోట్లను ఎంతో పారదర్శకంగా బ్యాంక్ టు బ్యాంక్ విధానంలో చెల్లించిన తర్వాత… అందులో అవినీతి ఎక్కడ? మనీ లాండరింగ్ ఎక్కడ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దూరదృష్టి లేకపోవడం వల్ల తర్వాతి రేస్ సీజన్ ను రద్దు చేశారని విమర్శించారు. తప్పు లేకపోయినా కాలం వెళ్లదీసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. నిజం ఏందో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.