హైదరాబాద్: పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డీ. శ్రీనివాస్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్‌లోని ఓ దవాఖానకు తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. గత కొంతకాలంగా ఆయన శ్వాస సంబంధిత సమస్యలతోపాటు పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. డీఎస్‌కు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ రావడంతోపాటు పక్షవాతం కూడా సోకింది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని, ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స అందిస్తున్నదని కుటుంబ సభ్యులు తెలిపారు. డీఎస్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తంచేస్తున్నారు..
1948, సెప్టెంబరు 27న డీ.శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో జన్మించారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశారు. కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన డీఎస్.. ఆ పార్టీలో ఉన్నత పదవులను చేపట్టారు. 1989లో నిజామాబాద్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1998లో తొలిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. 1999లో బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణను ఓడించి రెండోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉప నాయకుడిగా పనిచేశారు. 2004, 2009లో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.
2004లో టీడీపీ అభ్యర్థి సతీష్ పవార్‌ను ఓడించి నిజామాబాద్ నుంచి మూడో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో డీఎస్ ఓడిపోయారు. 2010లో జరిగిన ఉప ఎన్నికలల్లో, 2014లో నిజామాబాద్ రూరల్ నుంచి పోటీచేసి వరుసగా ఓడిపోయారు. దీంతో 2015, జూలై 2న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు. కానీ, పదవీ కాలం ముగిసే వరకు పార్టీలో కొనసాగారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. ఆయన కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బిజెపి ఎంపిగా నిజామాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు… మరోకుమారుడు సంజయ్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.