బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు అరెస్ట్ అయ్యాడు. హైదరాబాద్‌కు వచ్చిన రహేల్‌ను సోమవారం విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజా భవన్ వద్ద కారు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అతని కోసం గత కొంతకాలంగా గాలిస్తున్నారు.
అయితే, ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్‌కు పారిపోయాడు. ఈ ప్రమాదం తర్వాత రహేల్‌కు బదులుగా మరొకరిని డ్రైవర్‌గా చేర్చి.. రహేల్ దుబాయ్ పారిపోవడం జరిగింది. దాంతో పోలీసులు రహేల్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అతని కోసం లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇవాళ రహేల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు తిరిగి రాగా, పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే షకీల్‌ను కూడా పోలీసులు నిందితుల జాబితాలో చేర్చడం జరిగింది. సాక్ష్యాలను తారుమారు చేసిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు అభియోగాలు మోపారు.