కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ అయ్యారు. దీంతో మల్లారెడ్డి పార్టీ మారతారనే వార్తకు బలం చేకూరుతోంది. ఆయన తనతో పాటు కుమారుడు భద్రారెడ్డిని కూడా తీసుకువెళ్లారు. గత కొన్నిరోజులుగా ఆయన పార్టీ మారతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలను ఆయన ఖండిస్తూ వస్తున్నారు.
కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆయన ఉవ్విళ్లూరుతున్నా.. రాష్ట్ర నేతలు ఎవరూ ఆయన రాకను స్వాగతించేలా కనపడటం లేదు. దీంతో ఆయన ఢిల్లీ వయా కర్ణాటకగా రాజకీయం నెరుపుతున్నట్లు కనిపిస్తోంది. మల్లారెడ్డి అంటే మైనంపల్లికి పొసగదు. ఈ నేపథ్యంలో ఆయన రాకను మైనంపల్లి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిని గతంలో తీవ్రస్థాయిలో మల్లారెడ్డి విమర్శించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అయితే పని అయ్యేట్టు లేదని.. ఇక డైరెక్టుగా పైనుంచి రావలన్న ఆలోచనతో మల్లారెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది.