కొడుకు, కోడలితో ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు కోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశమైంది. కోర్టు ఆదేశాలతో హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు మాజీ మంత్రి కుమారుడు, కోడలపై గురువారం కేసు నమోదు చేశారు. ఆస్తుల కోసం తనను బెదిరిస్తున్నారని మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కంతేటి సత్యనారాయణరాజు ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం 4లో నివాసముంటున్నారు. అయితే కొడుకు కేవీఎస్.రాజు, కోడలు పార్వతి భీమవరంలోనే ఉంటూ వ్యాపారం చేసుకుంటున్నారు.
గత కొంతకాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తండ్రీ కొడుకుల మధ్య వివాదం కొనసాగుతోంది. తన తదనంతరం ఆస్తులను కొడుక్కి చెందేలా వీలునామా రాసినట్టు సత్యనారాయణ రాజు పేర్కొన్నారు. అయితే ఇప్పుడే ఆస్తులు తమకు కావాలంటూ కొడుకు, కోడలు బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇటీవల తన ఇంటికి వచ్చిన కోడుకు, కోడలు.. బీరువా తాళాలు పగలగొట్టి ఆస్తులకు సంబంధించిన పత్రాలను తస్కరించారని ఫిర్యాదులో తెలిపారు. తాడేపల్లిగూడెంలో తన అత్తకు చెందిన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.