Tuesday, November 26, 2024

ప్లాస్టిక్‌ ఫ్రీ జోన్లుగా అడవులు.. అటవీ ప్రాంతాల్లో చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని అడవులు, రక్షిత ప్రాంతాలు, అర్బన్‌ ఫారెస్టు పార్కులను పాస్టిక్‌ ఫ్రీ జోన్లుగా మార్చేందుకు అటవీశాఖ చర్యలు చేపట్టింది. అడవుల సమీప ప్రాంతాల ప్రజలు, అటవీ రహాదార్ల వెంబడి ప్రయాణించే వారు విసిరే వస్తువుల వలన అటవీ ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ చెత్తా చెదారం పేరుకుపోతుంది. పోగుపడిన చెత్త వన్యప్రాణులతో పాటు అటవీప్రాంతాలకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుంది. చాలా చోట్ల అగ్ని ప్రమాదాలకు కూడా కారణం అవుతుంది. దీనిని నివారించేందుకు అటవీ శాఖ ఇప్పటికే చర్యలు ప్రారంభించింది. శ్రీశైలం దారిలో అమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వు ప్రాంతాల్లో 65 కిలో మీటర్ల మేర గత కొన్నేళ్ళుగా చెత్త సేకరించి, వాటిలో ఎ్టాస్టిక్‌ను వస్తువులను రీసైక్లింగ్‌కు పంపే విధానం అమలు చేస్తున్నారు.

దీంతో అమ్రాబాద్‌ అటవీ ప్రాంతం రహదార్లకు ఇరువైపులా పరిశుభ్రంగా మారింది. ఇదే విధానాన్ని మిగతా ప్రాంతాల్లో కూడా చేపట్టాలని అటవీ శాఖ నిర్ణయించింది. కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులోఇటీవల చెత్త తొలగించేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను అటవీశాఖ అధికారులు నిర్వహించారు. సుమారు వెయ్యి కిలోల ప్లాస్టిక్‌, ఇతర చెత్తను అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. అమ్రాబాద్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వులు, కేబీఆర్‌, మృగవని, హరిణ వనస్థలి జాతీయ ఉద్యాన వనాలు, పాకాల, కిన్నెరసాని, పోచారం, ఏటూరునాగారం అభయారణ్యాలు, 109 అటవీ అర్బన్‌ పార్కులు, జూ పార్కుల్లో ప్లాస్టిక్‌ను పూర్తిగా నియంత్రించాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి, హెడ్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ ఫోర్స్‌ ఆర్‌. ఎం. డోబ్రియల్‌ ఆదేశాలు జారీ చేశారు. అన్ని అటవీ ప్రాంతాల్లో చెత్త సేకరణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రీ సైకిల్‌ పాయింట్లు ఏర్పాటు, చెత్తను విడదీసి బాయిలింగ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌కు తరలింపును దశల వారీగా చేపట్టనున్నారు. అటవీ ప్రాంతాల వెంబడి ప్రయాణించే వారు చెత్తను అడవుల్లో వదిలిపెట్టకుండా బాధ్యతగా వ్యవహరించాలని అధికారులు సూచించారు.

ప్లాస్టిక్‌ బాటిల్స్‌, సిగరెట్‌ పీకలను అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టవద్దని పీసీసీఎఫ్‌ ఆర్‌. ఎం. డోబ్రియల్‌ కోరారు. అడవులు, వన్యప్రాణులకు ప్లాస్టిక్‌ వలన జరుగుతున్న అనార్ధాలు, పర్యావరణ పరంగా పొంచివున్న ముప్పుపై అందరూ అవగాహనతో వ్యవహరించాలని ఆయన తెలిపారు. అడవులో ఉన్న దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, వ్యూ పాయింట్లు, వాటర్‌ ఫాల్స్‌, ఫారెస్టు అర్బన్‌ పార్కులకు సందర్శకుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని, ఈ క్రమంలో ప్లాస్టిక్‌ వ్యర్ధాలు కూడా పేరుకు పోవటం బాధాకరణని ఆయన పేర్కొన్నారు. అడవుల్లో ప్లాస్టిక్‌ రహిత పర్యావరణ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని, దీనికి అన్ని వర్గాలు, స్వచ్ఛంద సంస్థల సహకరించాలని ఆయన కోరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement