Friday, November 22, 2024

TS | ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌.. 20 వేలు తీసుకుంటుండగా పట్టివేత

కామారెడ్డి, ప్రభన్యూస్‌: కామారెడ్డి జిల్లాలో ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. రాజంపేట మండలం కొండాపూర్‌ ఫారెస్ట్‌ ఏరియా బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, ఓ రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మాటువేసి పట్టుకున్నారు. ఈ ఘటన బుధవారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్గొండ గ్రామానికి చెందిన రైతు తుల సిద్ధిరాములు వ్యవసాయ భూమికి వెళ్లే దారిలో కల్వర్టు నిర్మాణం చేస్తున్నారు.

బీట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ కల్వర్టు నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇది అటవీ భూమిలోకి వస్తుందని, నిర్మాణ పనులు ఆపివేయాలని చెప్పాడు. లేదంటే ఉన్నతాధికారులకు చెప్పి చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతు ఎలాగైనా నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరాడు. దీంతో బీట్‌ ఆఫీసర్‌ రూ.30 వేలు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. అందులో రూ.20 వేలు తీసుకొని రైతు సిద్ధిరాములు బుధవారం కామారెడ్డి పట్టణానికి వచ్చి కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఓ హోటల్‌లో శ్రీనివాస్‌కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో ఏసీబీ సీఐలు శ్రీనివాస్‌, నగేష్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement