Sunday, September 8, 2024

రైల్వే పనుల్లో పరదేశీ మైనర్లు.. ఎర్రటెండలో ప్లాట్‌ఫారం పనులతో వెట్టిచాకిరీ

మహబూబాబాద్‌, ప్రభన్యూస్‌: పాలబుగ్గల పసివాళ్లు వసివాడుతున్నారు. వేల కిలో మీటర్లదూరాన ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వెట్టిచాకిరీ చేస్తున్నారు. కాగితపు పులుల్లాంటి చట్టాల నీడ వారిపై పడకపోవడంతో ఎర్రటెండలో మగ్గిపోతున్నారు. బాలల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుంటే.. కేంద్ర పరిధిలోని రైల్వే శాఖలో మైనర్లతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. పుస్తకాల సంచి భుజాన వేసుకుని పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన వయసులో తట్టా, పార పట్టుకుని, ఇసుక బొచ్చెలు మోస్తున్నారు. ఇదంతా ఏ మారుమూల ప్రాంతంలో అనుకుంటే పొరపాటే.. జిల్లా కేంద్రమైన మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో మైనర్లతో పనులు చేయించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఒకటోనెంబరు, రెండో నెంబరు ప్లాట్‌ఫారాలపై జీఆర్‌పీ పోలీస్‌ అవుట్‌పోస్టు, సీఆర్‌పీఎఫ్‌ పోలీస్‌ అవుట్‌ పోస్టు, వాటిలో చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉన్నప్పటికీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

పాపం పరదేశీ పసివాళ్లు..

మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కొత్తగా ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జీని, దానికి లిఫ్టును ఏర్పాటు చేస్తున్నారు. రెండు ఫ్లాట్‌ఫారాలపై కొత్తగా నాపరాళ్లను పరుస్తున్నారు. అయితే ఈ పనుల్లో చాలా మంది హిందీ రాష్ట్రాలకు చెందిన మైనర్లను పనిలో పెట్టుకున్నారు. పట్టుమని 16 సంవత్సరాలు కూడా లేని బాలురితో పనులు చేయిస్తున్నారు. వారితో ఎర్రటెండలో బొచ్చెలలో మట్టి, సిమెంటు, ఇసుక, నాపరాళ్లు మోయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన అన్ని విద్యా చట్టాలలో కూడా మైనర్‌లు తప్పనిసరిగా పాఠశాలకు వెళ్లి చదువుకోవాలి. తరగతి గదులు దేశ భవితకు పునాదులయ్యే భావి మేధావులను తయారు చేయాలి. కానీ ఆ చట్టాలన్నీ మహబూబాబాద్‌ రైల్వే స్టేషన్‌లో చట్టుబండలయ్యాయి.

అందరూ అధికారులే.. పట్టించుకునే వారే లేరు..

జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్‌ కావడంతో నిత్యం పలు విభాగాలకు చెందిన అధికారులు వచ్చి పోతుంటారు. చిన్న పిల్లలను రక్షించే విభాగానికి చెందిన పోలీసు, రైల్వే పోలీసు, మహిళా శిశు సంరక్షణ విభాగం, చైల్డ్‌ లైన్‌, 1098, బాలల రక్షణ సమితి తదితర అధికారులు, స్వచ్ఛంద సంస్థల వారు తిరగాడే ప్రదేశంలో పనిచేస్తున్న చిట్టి చేతులు వారికి ఏమాత్రం కనిపించడం లేదు. కనీసం రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలీసు ఔట్‌ పోస్టులో విధులలో ఉన్న చిల్డ్రన్‌ వెల్ఫేర్‌ అధికారి కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ సొంత జిల్లాలో మైనర్లతో పనులు చేయిస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చైల్డ్‌ లేబర్‌కు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement