Saturday, November 23, 2024

Minister KTR : తొమ్మిదేండ్ల‌లో మున్సిపాలిటీల అభివృద్ధికి రూ. 1.21 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు

హైద‌రాబాద్ : తొమ్మిదేండ్ల‌లో మున్సిపాలిటీల అభివృద్ధికి పుర‌పాల‌క శాఖ ద్వారా రూ. 1.21 ల‌క్ష‌ల కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రాష్ట్రం ఏర్ప‌డి ప‌దో సంవ‌త్స‌రంలో అడుగుపెట్టిన సంద‌ర్భంగా ఈసారి పుర‌పాల‌క శాఖ ద‌శాబ్ది నివేదిక‌ను విడుద‌ల చేశామ‌ని తెలిపారు. ఇది చాలా స‌మ‌గ్ర‌మైన నివేదిక అని పేర్కొన్నారు. పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారిత‌నం ల‌క్ష్యంగా ద‌శాబ్ది నివేదిక ఉంద‌న్నారు. పుర‌పాలిక శాఖ ద‌శాబ్ది నివేదిక‌ను మంత్రి కేటీఆర్ విడుద‌ల చేశారు. 2014 నుంచి ప‌ట్ట‌ణాల అభివృద్ధిపై ప్ర‌తి ఏటా జూన్‌లో వార్షిక ప్ర‌గ‌తి నివేదిక‌ను విడుద‌ల చేస్తున్నామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు.

ఈ ద‌శాబ్ది నివేదిక‌లో 2014 నుంచి సాధించిన ప్ర‌గ‌తిని పొందుప‌రిచామ‌న్నారు. 26 మున్సిపాలిటీల‌కు కేంద్రం అవార్డులు ఇచ్చిందన్నారు. కొత్త పుర‌పాల‌క చ‌ట్టం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని తెలిపారు. ఈ ప‌దేండ్ల‌లో 462 శాతం ఎక్కువ ఖ‌ర్చు చేశామ‌ని తెలిపారు. ఈ ప‌దేండ్ల‌లో చ‌ట్ట‌బ‌ద్దంగా రావాల్సింది త‌ప్ప కేంద్రం రూపాయి కూడా అద‌నంగా ఇవ్వ‌లేదని పేర్కొన్నారు. ఏ రంగం తీసుకున్నా గ‌తంలో కంటే అనేక రెట్లు ఎక్కువ ఖ‌ర్చు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌లో గ‌ణ‌నీయ‌మైన వృద్ధి సాధించామన్నారు. ఈ ప‌దేండ్ల‌లో గ‌ణ‌నీయ‌మైన, గుణాత్మ‌క‌మైన తేడా క‌నిపిస్తుంద‌న్నారు. న‌గ‌ర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామ‌ని కేటీఆర్ తెలిపారు. ఎస్ఆర్‌డీపీ ద్వారా 35 వ‌ర‌కు ఫ్లై ఓవ‌ర్లు నిర్మించామ‌ని గుర్తు చేశారు. ఉప్ప‌ల్, అంబ‌ర్‌పేట ఫ్లై ఓవ‌ర్ల‌ను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయ‌లేక‌పోతుంద‌న్నారు.

తాము 35 ఫ్లై ఓవ‌ర్లు పూర్తి చేస్తే, వాళ్లు 2 కూడా చేయ‌లేక‌పోతున్నారు. హైద‌రాబాద్‌లో ప్ర‌ధాన ర‌హ‌దారుల నాణ్య‌త పెరిగింద‌ని కేటీఆర్ తెలిపారు. వ‌ర‌ద ఇబ్బందుల‌ను త‌గ్గించేందుకు చర్య‌లు తీసుకుంటున్నాం అని కేటీఆర్ పేర్కొన్నా. చెరువుల సుందరీక‌ర‌ణ‌ను పెద్ద ఎత్తున చేప‌ట్టాం. ఎస్ఎన్‌డీపీ కింద నాలాల‌ను అభివృద్ధి చేస్తున్నాం. 150 కాల‌నీలు గ‌తంలో ముంపు వ‌ల్ల ఇబ్బంది ప‌డేవి. ఎస్ఎన్డీపీ వ‌ల్ల ఈ ముంపు బాధ త‌ప్పింది. హైద‌రాబాద్ చుట్టూ ఉన్న మున్సిపాలిటీల్లో రూ. 238 కోట్ల‌తో 19 ప‌నులు చేప‌ట్టాం. ఏడు ప‌నులు పూర్త‌య్యాయి. మిగ‌తావి కూడా పూర్తి చేశాం. హైద‌రాబాద్ న‌గ‌రంలో 2050 నాటికి తాగునీటి స‌మ‌స్య లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement