ఒరిజినల్ సర్టిఫెకెట్ కోసం హైకోర్టుకు
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించలేదని సర్టిఫికేట్ నిలిపివేత
ప్రాధాయపడినా పట్టించుకోని అధికారులు
హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థి
సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు
ట్రిపుల్ ఐటీ విద్యార్థికి ఒరిజనల్ సర్టిఫికేట్ అందజేత
ఆంధ్రప్రభ స్మార్ట్, బాసర : బాసర ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థి సామల ఫణి కుమార్ న్యాయపోరాటం ఫలించింది. ఈ పోరాటం ఎందరో విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఒరిజనల్ సర్టిఫికేట్‌ను విద్యార్థి ఫణి కుమార్ కు ఆర్‌జీయూకేటీ యూనివర్సిటీ అధికారులు అందజేశారు.
సమస్య ఇదీ…
బాసర ఆర్‌జేయూకేటీ యూనివర్సిటీలో సామల ఫణి కుమార్ ట్రిపుల్ ఐటీ పూర్తి చేశాడు. ఉన్నత చదువులు నిమిత్తం తనకు సర్టిఫికేట్ ఇవ్వాలని కోరాడు. అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ ను ప్రభుత్వం చెల్లించలేదని, ఆ ఫీజు చెల్లిస్తే సర్టిఫికేట్ ఇస్తామని యూనివర్సిటీ అధికారులు తేల్చి చెప్పారు. ఫీజు చెల్లించే పరిస్థితిలో లేనని, ఆ విద్యార్థి మొరపెట్టుకున్నా అధికారులు కనికరించలేదు. 2023 నుంచి సర్టిఫికేట్ కోసం యూనివర్సిటీ చుట్టూ తిరిగినా అధికారులు చలించలేదు.
హైకోర్టులో న్యాయపోరాటం
సర్టిఫికేట్ కోసం న్యాయపోరాటం ప్రారంభించారు. తనక తెలిసిన తక్కురి చందన అనే లాయర్ ద్వారా సామల ఫణి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఫణికుమార్‌కు ఒరిజనల్ సర్టిఫికేట్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సర్టిఫికేట్లు అందజేశారు.