టాస్క్‌ఫోర్స్ దాడుల్లో ఇద్దరు నిందితుల అరెస్టు
5.5 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు స్వాధీనం
రామగుండం సీపీ శ్రీనివాస్
మంచిర్యాల ప్రతినిధి/గోదావరిఖని, మే 28 (ప్రభన్యూస్): నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని, రైతులను నట్టేట ముంచే వారిని ఉపేక్షించబోమని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం రామగుండం కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జోన్ చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిషేధిత బీటీ- 3 నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు సీపీ తెలిపారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ… కర్ణాటక నుంచి విత్తనాలు కొనుగోలు చేసి మహారాష్ట్ర నుంచి రామగుండం పోలీస్ కమిషనరేట్ మీదుగా నకిలీ విత్తనాలు అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఇన్స్ పక్టర్ సంజయ్, ఎస్‌ఐ లచ్చన్న సిబ్బందితో కలిసి తనిఖీలు చేసే క్రమంలో బతుకమ్మ వాగు వద్ద ఐచర్ వ్యాన్‌లో పైన ఉల్లిగడ్డ బస్తాలు వేసుకొని కింద సుమారు రూ.16.50లక్షల విలువ గల 5.5 క్వింటాళ్ల ప్రభుత్వ నిషేధిత బీటీ- 3 నకిలీ విత్తనాలను తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరుకు చెందిన డ్రైవర్/ఓనర్ అయిన సొల్లు పెద్దయ్య, డీసీఎం వ్యాన్ క్లీనర్ సొల్లు హరి కుమార్‌లు పత్తి విత్తనాలను గుంటూరుకు చెందిన సుబ్బారావు వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి అమాయక రైతులకు అంటగట్టేందుకు తీసుకెళ్తున్నట్లు అంగీకరించారన్నారు. వారి వద్ద నుంచి నకిలీ విత్తనాలతోపాటు రూ.1.80లక్షల నగదు, ఐచర్ వ్యాన్‌ను స్వాధీనం చేసుకున్నామన్నారు. విచారణ నివిుత్తం నిందితులను చెన్నూరు పోలీస్ స్టేషన్‌లో అప్పగించారన్నారు. నకిలీ విత్తనాలను, అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన టాస్క్ ఫోర్స్ అధికారులకు, సిబ్బందికి సీపీ రివార్డ్‌లు అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సంజయ్, చిన్ను అగ్రికల్చర్ ఏవో గ్లాడ్సన్ పాల్గొన్నారు.