కలుషిత ఆహారం తిని ఒరిస్సా కు చెందిన ఇద్దరు వలస కార్మికులు మృతిచెందిన సంఘటన పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలంలోని గౌరేడ్డి పేటలోని ఎమ్ ఎస్ ఆర్ ఇటుక బట్టీలో చోటుచేసుకుంది. ఇటుక బట్టిలో పనిచేస్తున్న కార్మికులు కలుషిత ఆహారం తిని 19మంది కార్మికులు అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారు. పలువురు కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు చంద్రశేఖర భారీహ, లలితా మాజీలు మృతి చెందారు.
కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో 13మంది చికిత్స పొందుతుండగా, వారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన మరో నలుగురు కార్మికులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బట్టి యజమాని నిర్లక్ష్యం వల్లే కార్మికులు మృతి చెందడంతో పాటు అస్వస్థతకు గురయ్యారని కార్మికులు ఆరోపిస్తున్నారు. బట్టి యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న బసంత్ నగర్ ఎస్సై ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు.