నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 11మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత విద్యార్థినులకు వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో అప్రమత్తమైన పాఠశాల సిబ్బంది బాధిత విద్యార్థినులను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
అస్వస్థతకు గురైన కేజీబీవీ విద్యార్థులను పరామర్శించిన డీసీసీ అధ్యక్షులు
నిర్మల్ టౌన్, ఏప్రిల్ 20 (ప్రభ న్యూస్) : నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులను నిర్మల్ జిల్లా ఆసుపత్రిలో డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు శనివారం ఆసుపత్రిలో ఉదయం పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను విజ్ఞప్తి చేశారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీహరి వెంట నర్సాపూర్ (జి) పార్టీ మండల అధ్యక్షులు గడ్డం ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు ఉమ మహేశ్వర్, అజీమ్, నయన్నగారి మురళి, మనోజ్ యాదవ్, గాజుల రవి కుమార్, తదితరులున్నారు.