హైదరాబాద్, ఆంధ్రప్రభ: విద్యార్థుల ఆందోళనలతో బాసర ట్రిపుల్ ఐటీ అట్టుడుకుతోంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ విద్యార్థులు నిరవధిక ఆందోళనకు దిగారు. మెస్ కాంట్రాక్టును రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తోపాటు విశ్వవిద్యాలయానికి తక్షణమే పూర్తి స్థాయి కులపతి, ఉపకులపతిని నియమించాలని విద్యార్థులు శనివారం ఉపవాస దీక్షకు దిగి ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మరోవైపు విద్యార్థుల ఆందోళనకు బాసటగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీజేపీ నాయకులు బాసరరాగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు నేతృత్వంలో బీజేపీ నేతలు ట్రిపుల్ ఐటీ ముందు ఆందోళనకు దిగారు. వెంకటేష్ అనే కార్యకర్త కాళ్లపై నుంచి పోలీసు వాహనం వెళ్లడంతో ఆయన కుడి కాలు విరిగింది. ఇదిలా ఉండగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలంటూ ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉంటున్న మంత్రి సబితా ఇంటిని ముట్టడించారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో ఇంఛార్జీ వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య వేదుళ్ల వెంకటరమణ చర్చలకు ఆహ్వానించారు. విద్యార్థులు ఈ ప్రతిపాదనకు ససేమిరా అన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఎటువంటి డిమాండ్లకు వచ్చేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ఆందోళన మళ్లిd మొదటికి వచ్చినట్లయ్యింది. ఆందోళన విరమించకపోతే విద్యార్థులకు షోకాజ్ నోటీసు తర్వాత కూడా మారకుంటే సప్పెన్స్ వేటు వేస్తామని వెంకటరమణ హెచ్చరించడంతో విద్యార్థులు ఆందోళనలు మరింత ఉదృతం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్ని రోజుల పాటు ట్రిపుల్ ఐటీని మూసివేయాలన్న ప్రతిపాదనకు విద్యాశాఖ వర్గాలు వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులు స్వయంగా వర్సిటీలో పర్యటించి విద్యార్థులతో చర్చలు జరిపి కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ నిరసనను విరమించారు. ఇటీవల కలుషిత ఆహారం తిని అనారోగ్యం పాలైన విద్యార్థుల్లో సంజయ్ అనే విద్యార్థి మరణించారనే ఆరోపణలు రావడంతో విద్యార్థులు మళ్లిd ఆందోళన బాట చేపట్టారు. గతంలో చెప్పినవిధంగా సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవడంలేదని, నాణ్యతలేని ఆహారం తిని ఇప్పటికే పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని విద్యార్థులు మండిపడుతున్నారు. మెస్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం రాత్రి విద్యార్థులు భోజనం చేయకుండా జాగారం ఉండగా ఆదివారం ఉదయం అల్పాహారం తీసుకోకుండా మెస్‌లోనే తమ నిరసనను తెలిపారు. విద్యార్థులకు తల్లిదండ్రులు కూడా తోడవ్వడంతో వర్సిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. క్యాంపస్ మెస్‌కు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.
మంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు కూర్చొని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి నివాసం ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీలోని సమస్యలను తీర్చకుండా కాలయాపన చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. విద్యార్థులకు మంత్రి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. మా పిల్లలు ఇబ్బందుల్లో ఉన్నారని, సమస్యలపై మంత్రికి వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చామని వెల్లడించారు. తమ పిల్లలు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలను తక్షణమే తీర్చాలి లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వెల్లడించారు.
తరచూ అనారోగ్యం పాలు: పేరెంట్స్ కమిటీ
ఆదివారం బాసర ట్రిపుల్ ఐటీ పేరెంట్స్ కమిటీ సమావేశమై పలు తీర్మానాలు చసింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షురాలు రాజేశ్వరి మాట్లాడుతూ అనేక సమస్యలతో బాసర విద్యార్థులు బాధపడుతున్నారని వివరించారు. మెస్సుల్లో నాణ్యతలేని ఆహారం తిని విద్యార్థులు నిత్యం అనారోగ్యం పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్లీ ఆహారం తినడంతోనే ఆరోగ్యం క్షీణించి సంజయ్ అనే విద్యార్థి మృతి చెందారని మీడియాతో తెలిపారు. విద్యార్థులకు పెట్టే ఆహారం విషయంలో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించడంలేదని ఆగ్రహించారు. మెస్సులో పెట్టే ఆహారాన్నే తామూ తింటున్నామని అధ్యాపకులు, ఇతర అధికారులు చెతున్నారన్న ఆమె వాళ్లు ఎప్పుడు తిన్నారో చెప్పాలన్నారు. విద్యార్థులు దాచుకున్న డబ్బు ఎక్కడికిపోయిందే అధికారులు చెప్పాలని డిమాండ్ కేశారు. నాణ్యమైన ఆహారం లభించకపోవడంతో విద్యార్థులు తరచుగా అనారోగ్య పాలై చదువుల్లో వెనకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై వీసీని కలిసి మాట్లాడుదామనుకుంటే తమను లోపలికి రానీయడంలేదని పేరెంట్స్ చెప్పారు. తామేమైనా తీవ్రవాదులమా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల 12 డిమాండ్లను పరిష్కరించాలని లేకపోతే ట్రిపుల్ ఐటీని మూసివేయాలన్నారు.
చదువులను ఆటంకం కల్గిస్తే ఊరుకునేదేలేదు! : ప్రొ.వి.వెంకటరమణ, ఇంఛార్జీ వీసీ
క్యాంపస్‌లో శ్రద్ధగా చదువుకునే విద్యార్థులను ఆటంకం కల్గిస్తే ఊరుకోమని ఇంచార్జీ వీసీ ప్రొ.వి.వెంకటరమణ హెచ్చరించారు. వర్సిటీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే పరిస్థితులు చక్కబడుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతవరకు విద్యార్థులు సంయమనం పాటించాలని కోరారు. క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని, అనవసరంగా బయటివాళ్ల మాటలు విని విద్యార్థులు ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. వర్సిటీలోలపలికి ఇతరులకు అనుమతి లేదని, ఎవరైనా నిబంధలనకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఫుడ్ పాయిజన్ వ్యవహారానికి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. వెస్ నిర్వాహకులకు నోటీసులిచ్చామన్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై విచారణకు ఆదేశించామని, నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మెస్ కాంట్రాక్టు కాలపరిమితి వచ్చే సెప్టెంబర్ వరకు ఉందని, కొత్త టెండర్లకు నోటీసులు జారీ చేశామన్నారు. విద్యార్థులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బును కాజేసినట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆ డబ్బు వర్సిటీ ఖాతాలోనే జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.