హెదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ పాలిసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్-2022 ప్రవేశ పరీక్ష ఫలితాలను సాంకేతిక విద్యామండలి కమిషనర్ నవీన్ మిఠల్ బుధవారం నాంపల్లిలోని కార్యాలయంలో విడుదల చేశారు. మొత్తం 1,13,979 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా అందులో 1,04,362 మంది పరీక్షకు హాజరైనారు. వీరిలో 75.73 శాతం అనగా 79,038 మంది ఉత్తీర్ణత సాధించారు. హాజరైన 56,392 బాలురులకు గాను 40,669 (72.12 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 47,970 మంది బాలికలు పరీక్షకు హాజరవగా అందులో 38,369 (79.99 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.
పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం మంది, ఎంబైపీసీ విభాగంలో 75.81 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. గతేడాది కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాది 81.73 శాతం ఉత్తీర్ణత సాధించగా ఈసారి 75.73 శాతం మాత్రమే సాధించారు. విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు 120 మార్కులకుగాను 36 మార్కులు పొందాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు నిర్ణీత ఉత్తీర్ణతకు 01 మార్కు పొందితే సరిపోతోంది. పరీక్షలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా అభ్యర్థులకు మెరిట్ ర్యాంకులు ఇవ్వడం జరిగింది.
తెలంగాణలోని ప్రభుత్వ, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులతో పాటుగా, వ్యవసాయ, ఉద్యానవన, వెటర్నరీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకోసం జూన్ 30న పాలిసెట్ పరీక్ష నిర్వహించారు. అయితే జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెటర్నరీ, హార్టికల్చర్ వర్సిటీలు ప్రత్యేకంగా ప్రవేశాల కోసం నోటిపికేషన్లు విడుదల చేస్తాయని నవీన్ మిట్టల్ ప్రకటించారు.
టాపర్లు వీరే…
ఎంపీసీ విభాగంలో 120 మార్కులతో టాపర్‌గా కరీంనగర్‌జిల్లాకు చెందిన గుజ్జుల వర్షిత మొదటి ర్యాంక్ సాధించారు. ఎంబైపీసీ విభాగంలో 119 మార్కులతో టాపర్‌గా మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన కల్లివరపు చంద్రశేఖర్ నిలిచారు. ఆగస్టు 17 నుంచి తరగతులు ప్రారంభించనున్నారు. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 18 నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 18 నుంచి 22 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 20 నుంచి 23వ తేదీ వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థులు 20 నుంచి 25 వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. తొలివిడత సీట్లను 27న కేటాయించనున్నారు. 27 నుంచి 31 వరకు తమకు కేటాయించిన కాలేజీల్లో అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆగస్టు 1 నుంచి ఫైనల్ ఫేజ్…
ఆగస్టు 1 నుంచి తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 1న తుది విడత స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. 2వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. 1 నుంచి 3వ తేదీ వరకు తుది విడత వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఆగస్టు 6న తుది విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అదేనెల 6 నుంచి 10వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 17వ తేదీ నుంచి పాలిటెక్నిక్ మొదటి ఏడాది తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8న స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన మార్గదర్శకాలను వెల్లడించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.