Tuesday, November 26, 2024

Follow up – యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ పునరుద్ధరణ – అధికారులను ఆదేశించిన మంత్రి ఉత్తమ్ …

మంథని, – సుందిళ్ళ బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను, గుత్తేదారు ఏజెన్సీలను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నిర్మించిన మూడు బ్యారేజ్ ల సందర్శనలో భాగంగా శుక్రవారం రాష్ట్ర నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంథని మండలం సిరిపురం గ్రామం వద్ద నిర్మించిన సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్ ను సందర్శించారు.

సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్ ను ఆసాంతం మంత్రి పరిశీలించారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన సూచనల ప్రకారం మరమ్మత్తు, పునరుద్ధరణ పనులు వేగవంతంగా పూర్తి కావాలని, క్షేత్రస్థాయిలో పనుల పురోగతిలో ఆశించిన మేర ఫలితం కనపడటం లేదని, అవసరమైన మేర అదనపు బృందాలను ఏర్పాటు చేసి పనులు వేగవంతం చేయాలని మంత్రి అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.

- Advertisement -

బ్యారేజ్ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని, ప్రతి పనికి సంబంధించి నిర్దేశిత సమయాన్ని నిర్దేశించుకొని దానిలోపు ఆ పని పూర్తి చేసే విధంగా ఏజెన్సీలు పనిచేయాలని, ఏ పని ఎప్పటి వరకు పూర్తవుతుందో కాగితంపై షెడ్యూల్ రూపొందించి అందించాలని మంత్రి ఆదేశించారు. సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్ సమీపంలో గల పంప్ హౌస్ సంరక్షణ కోసం నిర్మిస్తున్న కట్ట వల్ల స్థానికులకు కలిగే నష్టాన్ని స్థానిక మంత్రివర్యులు తో కలిసి అంచనా వేసి వాటి పరిష్కార మార్గాలను సూచిస్తూ ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి సంబంధిత ఇంజనీరింగ్ అధికారిని ఆదేశించారు.

ప్రాజెక్టు ఈ.ఎన్.సి అనిల్ కుమార్ జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆదేశాల ప్రకారం క్షేత్రస్థాయిలో నిర్వహిస్తున్న పనుల వివరాలను మంత్రికి వివరించారు. రాబోయే వానాకాలంలో మూడు బ్యారేజీల సంరక్షణకు, తదుపరి ఎటువంటి డ్యామేజీ జరగకుండా పనులు చేపట్టామని ఈఎన్సీ తెలిపారు. సుందిళ్ల (పార్వతి) బ్యారేజ్ వద్ద కొట్టుకుపోయిన ఇసుక పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని , జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల ప్రకారం జియో ఫిజికల్, జియో టెక్నికల్ జనరల్ పరీక్షలు నిర్వహించి కొట్టుకుపోయిన ఇసుకను అంచనా వేసి వాటిని పునరుద్ధరించి బ్యారేజ్ ఎటువంటి మరమ్మత్తుకు గురికాకుండా సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, మంత్రి ఆదేశాల మేరకు పనులను క్షేత్రస్థాయిలో వేగవంతం చేసి రాబోయే పది రోజుల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేస్తామని ఈఎన్సీ అన్నారు.

అనంతరం మీడియాతో రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పటికి నిర్లక్ష్యం వహిస్తూ ఎటువంటి మరమ్మత్తులు చేపట్టలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 3 బ్యారేజీల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని, దేశంలోనే పార్లమెంట్ ద్వారా ఏర్పాటు చేసిన అత్యున్నత సంస్థ అయిన జాతీయ డ్యామ్ సేఫ్టీ అధారిటీలకు బాధ్యత అప్పగించడం జరిగిందని అన్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అందించిన మద్యంతర నివేదిక ప్రకారం రాబోయే వానా కాలంలో మూడు బ్యారేజీల సంరక్షణ కోసం పనులు చేపట్టామని, క్షేత్రస్థాయిలో బ్యారేజీలను పరిశీలించి ఆ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేలా సంబంధిత ఏజెన్సీలను, ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని అన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను పరిశీలించేందుకు తమ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జ్ జస్టిస్ ఆధ్వర్యంలో వేసిన జ్యుడీషియల్ కమిషన్ సైతం ప్రాజెక్టును సందర్శిస్తుందని మంత్రి అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజీని తప్పనిసరిగా నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.

అనంతరం భూపాల్ పల్లి జిల్లాలో ఉన్న అన్నారం(సరస్వతి) బ్యారేజీ సందర్శనకు మంత్రి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నీటి పారుదల శాఖ ఈ.ఎన్.సి జనరల్ జి.అనిల్ కుమార్, ఎస్.ఈ.ఏం. కరుణాకర్, ఈ.ఈ. సర్దార్ ఓంకార్ సింగ్, ఇతర నీటీ పారుదల అధికారులు, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement