Friday, November 22, 2024

Follow up – పెద్దపులి చనిపోయిందా?… చంపేశారా?

ఆదిలాబాద్ బ్యూరో, (ప్రభ న్యూస్) : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాగజ్ నగర్ అటవీ డివిజన్ ప్రాణహిత నదీపరివాహక ప్రాంతంలో పెద్దపులి తీవ్ర గాయాలతో చ‌నిపోయింది. ఈ ఘటన కలకలం రేపుతోంది. కాగజ్‌న‌గర్ రూరల్ మండలం దారిగాం శివారులోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం తీవ్ర గాయాలతో రక్తసిక్తంగా పడి ఉన్న ఆడపులి మృతదేహాన్ని అటవీ అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులు హుటాహుటిన తరలివచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించి ఆదివారం పంచనామా నిర్వహించారు. డీఎఫ్ఓ నీరజ్ కుమార్ మాత్రం రెండు పులులు భీక‌రంగా దాడి చేసుకోగా తలకు, వీపు భాగంలో తీవ్ర గాయాలు కావడం వల్ల ఒక పులి మృతి చెందిందని.. మరో పులి అక్కడి నుండి వెళ్లిపోయిందని తెలిపారు. కాగ‌జ్‌న‌గ‌ర్‌ అటవీ ప్రాంతంలో కొంతకాలంగా పులుల సంచారం పెరగడం ఈ ప్రాంతంలో ఆవాసం ఏర్పరుచుకోవడం గమనార్హం. ఆదివారం అటవీ ఉన్నతాధికారులతో పాటు సి సి ఎఫ్ శివరాం, వన్యప్రాణి విభాగం అధికారులు అత్యవసరంగా సమావేశమై పులుల సంరక్షణపై తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్షించారు. మృతి చెందిన పులి సంఘటన స్థలంలో పక్కనే ఓ పశువు కూడా మృతి చెంది ఉండడం పలు అనుమానాలకు తావిస్తుంది.అయితే పులి మృతి వెనుక పలు రకాల అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

ప్రాణహిత కారిడార్లో 12 వరకు పులులు…
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాగజ్నగర్ అటవీ ప్రాంతం పెద్దపులుల ఆవాసానికి కేంద్ర బిందువుగా మారింది. నదీ పరివాహక ప్రాంతంలోని కాగజ్నగర్ దట్టమైన అటవీ ప్రాంతం పుల్ల విడిదికి ఆవాసంగా అనుకూలంగా ఉండడంతోనే పెద్ద పులుల కదలికలు ఈ ప్రాంతంలో అలజడి రేపుతున్నాయి. పంటచేలకు వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు మహిళలు బీతిల్లిపోతున్నారు. ఇటీవలే ఈ అటవీ ప్రాంతంలో నందిగామ వద్ద పశువుల కాపరి పెద్దపులి దాడిలో గాయపడి బతికి బయటపడ్డాడు. ఇదే ప్రాంతంలో పులి దాడిలో ఒక పశువు చనిపోయింది. కొందరు స్మగ్లర్లు విష ప్రయోగం జరిపి పులులను హతమారుస్తున్నట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో చెన్నూరు అటవీ ప్రాంతంలో పంగిడి సోమవారం వద్ద కరెంటు తీగలు మార్చడంతో ఒక పులి ఉచ్చులో పడి మృతి చెందింది. పెద్ద పులుల చర్మానికి, గోళ్ళకు నిషేధిత మార్కెట్లో భారీ డిమాండ్ ఉండడంతోనే స్మగ్లర్లు పులులను విష ప్రయోగం జరిపి హతమారుస్తున్నట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై అధికారులు ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 10 నుండి 12 వరకు పెద్ద పులులు ఉన్నాయని, సిర్పూర్ టీ అటవీ ప్రాంతంలోని నాలుగు పులి పిల్లలతో ఒక పెద్ద పులి సంచరిస్తున్నట్టు సమాచారం. పులుల సంరక్షణ కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే పెద్దపులల ఉనికికే ప్రమాదం ఏర్పడే అవకాశం పొంచి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement