హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : కృష్ణా నదిపై భారీ వ్యయంతో ప్రభుత్వం నిర్మిస్తోన్న పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో అపశృతి చోటు చేసుకుంది. ప్రాజెక్టు పనుల్లో భాగంగా శుక్రవారం ఉదయం పంపుహౌస్‌లోకి క్రేన్ దిగుతుండగా జరిగిన ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. క్రేన్ వైరు తెగిపోవడంవల్లే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుందని కూలీలు, ఉద్యోగులు చెబుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రేగుమాణుగడ్డ వద్ద పాలమూరు ఎత్తిపోతల పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో భాగంగా పంపుహౌస్‌లోకి క్రేన్‌ను దింపుతుండగా ఒక్కసారిగా తీగలు తెగిపడి అక్కడ పని చేస్తున్న ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారని, వారిని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రమాదంలో మరణించిన వారంతా బీహార్‌కు చెందిన వలస కూలీలుగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికిగల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఐదుగురు కార్మికులు మృతి చెందడంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన బండి సంజయ్
పాలమూరు – రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనుల్లో క్రేన్ వైర్లు జారిపడి ఐదుగురు కార్మికులు దుర్మరణం చెందడం దిగ్భ్రాంతి కలిగించింది భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. ఉపాధి కోసం బీహార్ నుంచి పాలమూరుకు వచ్చి ఇక్కడ చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల మృతితో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయని మరణించిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.