Wednesday, November 20, 2024

Follow Up : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరదలు.. మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ వద్ద 81 గేట్లు ఎత్తివేత

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: అల్పపీడన ద్రోణి, ఉపరితల ఆవర్తనంతో వర్షాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు జనం ఇండ్లకే పరిమితమయ్యారు. వాగులు, వంకలు ఉధృతంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలకు రాకపోకలుతెగిపోయాయి. 163వ జాతీయ రహదారిలో ఏటూర్‌నాగారం మీదుగా చత్తీస్‌గఢ్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఉధృతంగా వరదలు ప్రవహిస్తుండటంతో చత్తీస్‌గఢ్‌కు పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. మహాదేవపూర్‌ పలిమెల మండలానికి పూర్తిగా బాహ్య సంబంధాలు తెగిపోయాయి. పెద్దవాగు ఉధృతంగా ప్రవహించడంతో ప్రధాన రహదారి కొట్టుకుపోవడం వలన రాకపోకలు నిలిచిపోయాయి.

ఉగ్రరూపం దాల్చిన‌ గోదావరి..

ఎగువ ప్రాంతంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గోదావరి వరద పెరగడంతో ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. కాళేశ్వరం వద్ద మేడిగడ్డ లక్ష్మి బ్యారేజి వద్ద 8,95,330 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 81 గేట్లు ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చిన ట్లుగానే యధావిధిగా కిందకు పంపిస్తున్నారు. ఈ వరద ప్రవాహంతో పాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద కిందికిపోతుంటే వరద ప్రవాహం మరింతగా పెరిగింది. వాటికి తోడు ములుగు జిల్లా ప్రాంతానికి వచ్చినటువంటి వరదలు గోదావరిలో చేరడంతో ఏటూర్‌నాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్‌ వద్ద 16 మీటర్లకు పైగా వరద ప్రవహిస్తుండటంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసారు. ఏటూర్‌నాగారం మండలంలోని రామన్నగూడెం, రాంనగర్‌, లంబాడి తండా గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

నిలిచిన ఓపెన్‌ కాస్టు ఉత్పత్తి పనులు..

భూపాలపల్లి జిల్లాలోని ఓపెన్‌ కాస్టు బొగ్గు ఉత్పత్తికి గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో అంతరాయం ఏర్పడింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓపెన్‌ కాస్టులలో 18వేల టన్నుల ఉత్పతి నిలిచిపోయింది. అదేవిధంగా మల్హర్‌ మండలం తాడిచర్ల ఓపెన్‌ కాస్టులో మూడు రోజుల నుంచి 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతోపాటు 3లక్షల70వేల క్యూబిక్‌ మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -

వరదప్రాంతాలను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్‌..

గత మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ములుగు జిల్లాలో సంభవించిన వరద ప్రాంతాలను రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, ములుగు జిల్లా జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీశ్వర్‌, ములుగు ఎమ్మెల్యే సీతక్క సదర్శించారు. ఏటూర్‌నాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి ఉధృతిని పరిశీలించారు. గంట గంటకు గోదావరి నీటిమట్టం పెరగడంతో గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వరద ప్రాంత ప్రజలకు పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసి సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 24 గంటల పాటు అధికారులు అందుబాటులో ఉండి వరద పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్‌కు, ఐటీడీఏ పీఓకు సూచించారు.

గర్భిణీలను దాటించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు..

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలానికి చెందిన ఇద్దరు గర్భిణీలను ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు
వాగు దాటిచ్చి జిల్లా కేంద్రానికి తరలించారు. మహాదేవ్‌పూర్‌ – పలిమెల గ్రామాల మధ్య ఉన్న పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తండటంతో ప్రధాన రహదారి తెగిపోయి పలిమెల-మహాదేవ్‌పూర్‌ మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సోమవారం రోజున పలిమెల మండలం లెంకల గడ్డకు చెందిన మడప పుష్పలత, సర్వాయిపేటకు చెందిన పాగే రాధిక అనే ఇద్దరు గర్భిణీలను ఎన్‌ డిఆర్‌ఎఫ్‌ బృందాలు సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement