Thursday, November 21, 2024

Floods – ఉమ్మ‌డి మ‌హబూబ్‌న‌గ‌ర్ జిల్లా అస్త‌వ్య‌స్థం – స‌ర‌ళ సాగ‌ర్ గేట్లు ఎత్తివేత‌

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో తెరిపివ్వ‌కుండా వ‌ర్షం కురుస్తోంది. మహబూబ్‌నగర్ పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గణేశ్‌ నగర్‌తోపాటు, బస్టాండ్ సమీపంలోని జగ్జీవన్‌రామ్ నగర్ కాలనీలో ఇళ్లలోకి నీరు చేరింది. పెద్ద చెరువుకు దిగవన ఉన్న బీకే రెడ్డి కాలనీ, పీర్లబాయి సహా పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ప్ర‌వ‌హిస్తోంది. మహమ్మదాబాద్‌-ఇబ్రహీంబాద్‌ మధ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో మహబూబ్‌నగర్‌-కోస్గి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి మిడ్జిల్‌ మండలం వాడ్యాల శివారులో కల్వకుర్తి లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో వరి, పత్తి పొలాలు నీటమునిగాయి. శంకర సముద్రం నుంచి నీరు విడుదల చేయడంతో మదనాపురం మండలంలోని దంతనూరు-శంకరమ్మపేట గ్రామాల మధ్య వాగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కూలిన ఇల్లు.. ఇద్ద‌రు మృతి
నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలలోని ఎక్కమెడిలో ఓ ఇల్లు కూలిపోయింది. అందులో నిద్రిస్తున్న తల్లీకూతురు హన్మమ్మ, అంజిలమ్మ మృతి చెందారు. నిన్న రాత్రి నుంచి వ‌ర్షం భారీగా కురుస్తోంది. దీంతో ఆ ఇంటి గోడ‌లు నానిపోయి కూలిపోయింది. అదే స‌మయంలో నిద్ర‌లో ఉన్న త‌ల్లి అంజిల‌మ్మ‌, కుమార్తె హ‌న్మ‌మ్మ ఇద్ద‌రు శిథిలాల్లో చిక్కుకుని మృత్యువాత ప‌డ్డారు.

స‌ర‌ళ‌సాగ‌ర్ గేట్లు ఎత్తివేత‌


వనపర్తి జిల్లాలోని సరళ సాగర్‌ ప్రాజెక్టులో నీరు చేర‌డంతో గేట్లు ఎత్తివేశారు. దీంతో మదనాపూర్‌ గ్రామ శివార్లలోని వాగు పొంగిపొర్లుతోంది. ర‌హ‌దారిపైకి నీరు పార‌డంతో ఆత్మకూరు, అమరచింత, మక్తల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ సమీపంలోని శంకర సముద్రం రిజర్వాయర్ రెండు గేట్లను మూడు అడుగుల వరకు ఎత్తి దిగువకు 1500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోనికి 2500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది.

- Advertisement -


వ‌ర్ష‌పాతం వివ‌రాలు
హుజూర్‌నగర్‌లో 29.9 సెం.మీటర్ల వర్షపాతం న‌మోదైంది, మహబూబాబాద్‌ జిల్లా ఇంగుర్తిలో 29.8 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా చిలుకూరులో 29.7 సెం.మీ., మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేటలో 29.6 సెం.మీ., ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 29.6 సెం.మీ., మహబూబాబాద్‌ జిల్లాలోని దంతాలపల్లిలో 29.4 సెం.మీ., మరిపెడలో 29.1 సెం.మీ., కురవిలో 28.6 సెం.మీ., చినగూడులో 28.5 సెం.మీ., సూర్యాపేట జిల్లా మట్టంపల్లిలో 28 సెం.మీ., మద్దిరాలలో 27.7, వరంగల్‌ జిల్లా పర్వతగిరిలో 26.6 సెం.మీ., మహబూబాబాద్‌లో 26.6 సెం.మీ., వరంగల్‌ జిల్లా నెక్కొండలో 25.9, సూర్యాపేటలోని మోతెలో 25.9 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement