Tuesday, November 26, 2024

Delhi: తెలంగాణ‌లో వ‌ర‌ద‌లు, ఢిల్లీలో కేసీఆర్‌.. మోదీ గుజరాత్‌కు ప్రధానా దేశానికా: రేవంత్ ధ్వజం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఓవైపు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి సాయం కోరాల్సిన ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఢిల్లీలో తన నివాసానికే పరిమితమయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. బుధవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్ మీడియా సెంటర్ వద్ద మాట్లాడిన రేవంత్, కేసీఆర్ ఢిల్లీ పర్యటనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ వచ్చిన సీఎం వరద నష్టంపై కేంద్రానికి నివేదించి సాయం కోరాలని, కానీ కనీసం అపాయింట్మెంట్ కూడా కోరలేదని మండిపడ్డారు.

గోదావరి నదికి సంభవించిన వరదల కారణంగా రూ. 1,400 కోట్ల మేర ఆస్తినష్టం వాటిల్లిందని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిందని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం చేసిన ప్రయత్నమేదని నిలదీశారు. తమకున్న సమాచారం ప్రకారం రూ. 3 వేల కోట్లపైనే నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇలాంటి వైపరీత్యాలు సంభవించినప్పుడు మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని, కానీ కేసీఆర్ అదేదీ చేయలేదని అన్నారు. అఖిలపక్షం ఏర్పాటుచేసి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, వీలుంటే అఖిలపక్షంతో ఢిల్లీకి వచ్చి కేంద్ర సాయం కోరాలని, కానీ అలాంటి ప్రయత్నమేదీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు.

మరోవైపు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీరుపైనా విరుచుకుపడ్డారు. ఆయన గుజరాత్ రాష్ట్రానికి ప్రధాన మంత్రో లేక దేశానికి ప్రధానో అర్థంకావడం లేదని అన్నారు. గుజరాత్‌లో వరదలు వస్తే మోదీ స్పందించే తీరు, మిగతా రాష్ట్రాల్లో వరదలు వచ్చినప్పుడు స్పందించే తీరుతోనే ఈ అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్లు మునిగిపోయి, భద్రాచలం పట్టణం మునిగిపోయేంత వరద వచ్చినా కనీసం పలకరింపు లేదని మండిపడ్డారు. వరదల కారణంగా తెలంగాణ రాష్ట్రానికి జరిగిన నష్టంపై కలిసి సాయం కోసం విజ్ఞప్తి చేద్దామని ప్రధాని అపాయింట్మెంట్ కోరితే, ఇంతవరకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరదలపై కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందిందో వెల్లడించాలని అన్నారు.

పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే టీఆర్ఎస్ ఎంపీలు రాష్ట్ర సమస్యల గురించి వాయిదా తీర్మానాలు, జీరో అవర్ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఫొటోల కోసం విపక్షాలు చేసే ధర్నాలో వెనుకాల నిలబడి కాసేపు హంగామా చేస్తున్నారు తప్ప, తెలంగాణ సమస్యల ప్రస్తావనే లేదని మండిపడ్డారు. ఇటుచూస్తే ముఖ్యమంత్రి ఢిల్లీలో కూర్చుని వివిధ శాఖల ద్వారా రుణాలు ఎలా సేకరించాలి అన్న విషయం మీదే చర్చిస్తున్నట్లు తెలిసిందని, ప్రజల సమస్యలు గాలికొదిలి అప్పులపై దృష్టి పెట్టారని అన్నారు. ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ తెలంగాణ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే కేంద్రానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్‌ను, అలాగే ప్రాథమిక అంచనాలు వేసి తక్షణ సహాయం కింద రూ. 1000 కోట్లు విడుదల చేయాలని ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement