Friday, November 22, 2024

వ‌ర‌ద‌ల‌పై మండ‌లిలో చ‌ర్చ – విప‌క్షాల‌వి బుర‌ద రాజ‌కీయలంటూ ప్ర‌శాంత్ రెడ్డి విమర్శ

హైదరాబాద్ – వరదలపై ప్రతిపక్ష పార్టీలు బురద రాజకీయం చేస్తున్నాయని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. శాసన మండలిలో వర్షాలు, వరదలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆయ‌న మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. ప్రకృతి వైపరీత్యాలను ముందే ఊహించలేమని, ఆపలేమన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు ఫోర్స్‌గా నిలబడ్డారన్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారని, వరద ప్రాంతాలను పరిశీలించారన్నారు. వరద బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించారని చెప్పారు.

వరద సమయంలో సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌ పర్యవేక్షించారని, గోదావరి పరీవాహక ప్రాజెక్టుల వారీగా కేసీఆర్‌ మానిటరింగ్‌ చేశారన్నారు. ప్రాణ, ఆస్తినష్టం తగ్గించడంలో సీఎం కేసీఆర్‌ కృషి చేశారని, విపత్తును అంచనా వేస్తూ పర్యవేక్షించారన్నారు. కేసీఆర్‌ ఫొటోలకు పోజులు ఇచ్చే నాయకుడు కాదని స్పష్టం చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఎనిమిది ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని, మోరంచపల్లిలో హెలికాప్టర్‌, ఆర్మీని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

1,500 మందిని అగ్నిమాపక బృందాలు కాపాడాయ‌ని, 139 గ్రామాలు వరద బారినపడ్డాయని తెలిపారు. 27వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని, ఈదుకుంటూ వెళ్లి సిబ్బందిని విద్యుత్‌ను పునరుద్ధరించారని పేర్కొన్నారు. వరదల వల్ల 756 చెరువులకు గండ్లుపడ్డాయని, 786 ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ రోడ్లు కోతకు గురయ్యాయన్నారు. 773 గ్రామాలకు విద్యుత్‌ ఇబ్బందులు ఏర్పడ్డాయని, 23వేల స్తంభాలు, 3వేల డీటీఆర్‌లు చెడిపోయాయన్నారు. ఇసుక మేటకు గురైన వ్యవసాయ భూములను అంచనా వేస్తున్నామన్నారు. అనంతరం శాసన మండలి రేపటికి వాయిదాపడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement