నిజామాబాద్ ప్రతినిధి, జనవరి16 (ఆంధ్రప్రభ) : ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న రైతుల కల అయిన పసుపు బోర్డును పట్టుబట్టి తీసుకువచ్చిన ఎంపీ ధర్మపురి అరవింద్ కి జీవితాంతం రుణపడి ఉంటామని పసుపు రైతు ధన్యవాదాలు తెలిపారు. గురువారం నిజామాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లలో ఎంపీ ధర్మపురి అరవింద్ కు ధన్యవాదాలు తెలుపుతూ పసుపు రైతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చర్చనీ యాంశ మైంది. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు తీసుకువ స్తానని ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ రాసి ఇచ్చిన విషయం తెలిసిందే.
అప్పటి నుండి ఎంపీ పట్టుబట్టి పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్ర మంత్రులను కలిసి విన్నవించి చర్చించారు. అంతేకాకుండా ఏకంగా నిజామాబాద్ లో జరిగిన బహిరంగసభలో ప్రధాని మోదీ నోటనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎట్టకేలకు ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసు కురావడంలో సఫలీకృతమయ్యారు..
జిల్లాలో చర్చనీయాంశం…
ఎన్ని ప్రభుత్వాలు మారినా… రైతుల కోసం ఒరగబెట్టిందేమీ లేదు. రాజకీయాల్లో ఎంతో మంది నాయకులను చూశాను… కానీ అరవింద్ లాంటి మొండి పట్టున్న నాయకుడిని చూడలేమని పసుపు రైతు పేర్కొన్నాడు.
ఓ బిడ్డా!!! నిజామాబాద్ మరో 30ఏళ్లు నీ అడ్డా… ఎప్పటికీ నిన్ను మరవదు ఈ గడ్డ అని పసుపు రైతు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పేర్కొన్నాడు. పసుపు బోర్డు ఏర్పాటును అట్టహాసంగా వర్చువల్ గా ప్రారంభించడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఎంపీ ధర్మపురి అరవింద్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.