చికెన్…. అంటే ఇష్టపడనివారంటూ ఉండరు. రకరకాల రిసెపీలను తయారు చేసుకొని…. తినేస్తుంటారు. అయితే గత కొంతకాలంగా చూస్తే ధరలు ఎగబాకుతున్నాయి. రెండు వారాల కిందట వరకు కిలో చికెన్ ధర రూ. 220లోపు ఉండగా… ఈ వారం అమాంతం పెరిగేసింది. అంతా ఇంతా కాదు… ఏకంగా రూ. 300కి వచ్చి చేరింది. షాపులకు వెళ్తున్న కొనుగోలుదారులు… ధరలను చూసి షాక్ అవుతున్నారు.
మండుతున్న వేసవిలో కోడి కూర ధరలు కూడా కొండెక్కాయి. ప్రస్తుతం రూ. 300 వరకు చేరాయి. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.
కిలో రూ. 300..
ఇవాళ తెలంగాణలో ధరలు చూస్తే…. స్కిల్ లెస్ కేజీ చికెన్ ధర రూ. 300గా ఉంది. సరిగ్గా రెండు వారాల క్రితం చూస్తే… కేజీ చికెన్ స్కిన్ లెస్ ధర రూ.200 నుంచి రూ.220 వరకు పలికింది. అలాగే స్కిన్ తో చికెన్ కిలో రూ.180 నుంచి రూ.200 మధ్య అమ్మకాలు జరిపారు. అయితే ఈ మధ్య కాలంలో క్రమంగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ధర రూ. 300కి చేరటంతో మాంస ప్రియులు షాక్ అవుతున్నారు. స్కిన్ తో అయితే….రూ. 270 నుంచి 280 మధ్య అమ్ముతున్నారు. పెరిగిన చికెన్ ధరలు చూసి చికెన్ ప్రియులు నోరెళ్లబెడుతున్నారు.
కారణాలు ఇవే…
ప్రస్తుతం చికెన్ ధరలు పెరగటానికి గల కారణాలు చూస్తే… తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంది. మార్చి, ఏప్రిల్ మాసంలోనే… గరిష్ట్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఎండ వేడిమితో ఫ్రౌల్టీలలోని కోళ్లు చనిపోతున్నాయి. దీంతో ఉత్పత్తి తగ్గటంతో మార్కెట్ లో ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతూ వచ్చేసింది. రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారుల చెబుతున్నారు.