ఆర్థిక ఏడాది పన్నుల ఆదాయం పుంజుకుంటోంది. గతేడాది కరోనా కారణంగా కుదేలైన రాష్ట్ర రాబడి తాజాగా వృద్ధిరేటుకు చేరుతోంది. జీఎస్టీ వసూళ్లు కూడా స్థిర వృద్ధి దిశగా పుంజుకున్నాయి. 2021-22 ఆర్థిక ఏడాది జులై నుంచి నవంబర్ వరకు ప్రతినెలా సగటున రూ.3,600 కోట్లు ఖజానాకు రాబడి చేరగా, జీఎస్టీ పన్నుల రూపంలో గతేడాది ఇదే కాలంకంటే 23శాతం ఎక్కువ వృద్ధి సాకారమైంది. నవంబర్‌లో అత్యధికంగా రూ.3,931 కోట్ల పన్ను ఆదాయం ఆర్జించింది. ఇది గతేడాది నవంబర్ కంటే 24శాతం అధికం కావడం గమనార్హం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి 19శాతంగా ఉంది. నవంబర్ జీఎస్టీ పన్నుల వసూళ్లలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిల్చింది. తొలి ఏడు మాసాల్లో అక్టోబర్ చివరినాటికి రాష్ట్ర పన్నుల ఆదాయం రూ.54,198 కోట్లుగా నమోదు చేసుకుంది. రాష్ట్ర పన్నుల అంచనా రాబడుల్లో ఇది 51శాతానికి చేరింది. గతనెలలో నూతన ఆబ్కారీ పాలసీ నేపథ్యంలో రూ.4 వేల కోట్ల అదనపు రాబడి ఖజానాకు చేరింది.
ఇక గ్రాంట్ ఇన్ ఎయిడ్‌ల సాయంలో కేంద్రం కోతలు పెడుతోంది. ఈ పద్దు రూపంలో రావాల్సిన అంచనాల్లో తొలి ఏడు నెలల్లో 13శాతం మాత్రమే లక్ష్యం చేరింది. ఈ ఏడు మాసాల్లో రెవెన్యూ వసూళ్లు అంచనాల్లో 35శాతం కాగా, వ్యయం 42శాతంగా ఉంది. ఈ ఏడాది మొత్తం రాబడి అంచనా రూ.2.21 లక్షల కోట్లు కాగా, అక్టోబర్ చివరికి రూ.90,586 కోట్లు ఖజానాకు చేరింది. ఉద్యోగుల వేతనాలకు రూ.17,005 కోట్లు ఖర్చు కాగా, పింఛన్లకు రూ.5,603 కోట్లు, సబ్సిడీలకు రూ.6,272 కోట్లు, అడ్వాన్సులకు రూ.2,575 కోట్లు, పెట్టుబడి వ్యయం రూ.16,956 కోట్లకు చేరింది
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital