జనవరి 22న ప్రతి ఇంట్లో భక్తి శ్రద్ధలతో ఐదు దీపాలు వెలిగించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ మన కి బాత్ 108వ ఎడిషన్ కార్యక్రమాంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. 2024 మన దేశానికి ముఖ్యమైనటువంటి సంవత్సరం అన్నారు.
రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం జరగాలని 500 ఏండ్లుగా అనేక మంది పోరాటం చేసి.. చాలా మంది చనిపోయారని తెలిపారు. దేశ ప్రజలతోపాటు ప్రపంచంలోని హిందువులందరూ జనవరి 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. ఆరోజు ప్రతి హిందువు ప్రతి ఇంట్లో, ప్రతి దేవాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. వర్చువల్గా శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో ప్రతి హిందువు చూడాలన్నారు. ప్రతి ఇంట్లో జనవరి 22న ఐదు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అన్నారు. స్వామి వారి మహా హారతిలో పాల్గొని శ్రీరాముడి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నానని అన్నారు.