జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపుతప్పిన వేగంతో వెనుక నుంచి దూసుకొచ్చిన కారు ఢీకొట్టడంతో ఓ బౌన్సర్ అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కేసులో పోలీసులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో నలుగురు పురుషులు, ఓ అమ్మాయి ఉన్నారు.
ప్రమాదానికి ముందు నిందితులు మందు పార్టీ చేసుకున్నారు. మాదాపూర్ ఏరియాలో మద్యం సేవించి కూకట్పల్లి వెళ్తుండగా.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం నిందితులు సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు. వివరాలు ఇలా ఉన్నాయి…హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దమ్మ గుడి వద్ద బైక్ మీదపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడు 27 ఏళ్ల తారక్ జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్‌లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. డ్యూటీ ముగించుకుని బైక్ మీద ఇంటికి వెళ్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన కారు తారక్ ప్రాణాలను బలితీసుకుంది. జూబ్లీహిల్స్‌లో బుధవారం తెల్లవారుజామున జరిగిన హిట్ అండ్ రన్ కేసులో తారక్‌రామ్ మృతికి కారణమైన ఐదుగురు నిందితులను గురువారం తెల్లవారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాదీనం చేసుకున్నారు. ఇది కొత్త వెర్నా కారు అని పోలీసులు గుర్తించారు. ద్వారంపూడి నాగ అనే పేరుతో ఈ కారు రిజిస్ట్రేషన్ అయి ఉందని నిర్ధారించారు.