‘‘నాది.. నా కుటుంబ సభ్యులది.. చివరకు నా డ్రైవర్, వంటమనిషి సహా నా ఇంట్లో ప్రతి ఒక్కరి ఫోన్లు ట్యాప్ చేశారు” అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడ్ని తానేనని చెప్పుకొచ్చారు. మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై సమగ్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఎవరినీ నమ్మేవారు కాదు..
నాడు కేసీఆర్ కేబినెట్ లోని 17 మంది మంత్రులు ఉంటే.. అందరిపై నిఘా ఉండేదని, సొంత మంత్రులనే నాటి సీఎం నమ్మలేదని పేర్కొన్నారు. కేవలం ముఖ్య నాయకులే కాదు, వారి భార్య, లేదా భర్త.. ఫోన్లు కూడా వినేవారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూలిపోయాయని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరం అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని.. ఆ పార్టీలో ఉన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలతోనే అధికారిక కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు జరిపించేవారని చెప్పారు. కనీసం ప్రోటోకాల్ పాటించేవారు కాదని, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అలాగే చేస్తోందన్నారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఇప్పుడు కాంగ్రెస్ లో చేర్చుకున్నారని, వారినే రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి బరిలో దింపారని విమర్శించారు ఈటల.