హైదరాబాద్, ఆంధ్రప్రభ: రేపు ఇంటర్ సెకండియర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ విద్యా కార్యాలయంలో ఫలితాలను విడుదల చేయనున్నారు. ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం ఉత్తీర్ణత సాధించిన విషయం విధితమే. మొత్తం 9,28,262 మంది పరీక్షలు రాయగా మొదటి సంవత్సరంలో 2,94,378 మంది, సెకండియర్లో 4,63,370 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆగస్టులో జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో దాదాపు 1.13 లక్షల మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలు రాశారు. వీటి ఫలితాలను రేపు ఉదయం ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే రేపు ఎంసెట్ కౌన్సెలింగ్కు సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు చివరి తేదీ కావడంతో ముందస్తుగా సెకండియర్ ఫలితాలను వెల్లడిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సాయంత్రం లేదా మంగళవారం ఫస్ట్ ఇయర్ ఫలితాలను కూడా వెల్లడించే యోచనలో ఇంటర్ బోర్డు అధికారులు ఉన్నట్లు సమాచారం. విద్యార్థులు తమ ఫలితాలను ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్లో చూసుకోవచ్చని అధికారులు తెలిపారు.
మెమోలు అందక కౌన్సెలింగ్లో పాల్గొనక!..
ఎంసెట్ కౌన్సెలింగ్ నిర్వహణ, ఇంటర్ ఫలితాల ప్రకటనపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ అంతా గందరగోళంగా మారిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఇంజనీరింగ్ ఫీజులు ఖరారుకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయమే తీసుకోలేదు. అప్పడే కౌన్సెలింగ్ షెడ్యూల్ను ప్రకటించేశారు. ఆపైన జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూ ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ, కొత్త కోర్సులు, సీట్ల ఖరారు కూడా పూర్తి కాకముందే షెడ్యూల్ను విడుదల చేశారు. నామమాత్రపు ఫీజు కట్టి కౌన్సెలింగ్కు స్లాట్ బుక్ చేసుకున్న విద్యార్థులు ఇంటర్ ద్వితీయ సంవత్సరం సర్టిఫికెట్లు ఇంకా చేతికి అందకపోవడంతో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకాలేని పరిస్థితి. ఈక్రమంలోనే ఇప్పటి వరకు కేవలం 62,383 మంది విద్యార్థులు మాత్రమే ఎంసెట్ కౌన్సెలింగ్ ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొన్నారు. ఇంటర్ ఫలితాల కోసం వేచిచూస్తున్నది ఇంకా 1.13 లక్షల మంది వరకు ఉన్నారు. వీరందరికీ ఇంటర్ సర్టిఫికెట్లు అందుతేగానీ ఎంసెట్ ధ్రువపత్రాల పరిశీలనలో పాల్గొనే అవకాశం లేకపోవడంతో ఇంటర్ బోర్డు అధికారులు ఆగమేఘాలపై ఈ రోజు ఉదయం 9.30 గంటలకు సెకండియర్ ఫలితాలను ప్రకటించి ఆ వెనువెంటనే మెమోలను ఇవ్వనున్నారు. తద్వారా విద్యార్థులు కౌన్సెలింగ్లో పాల్గొనేవీలుంది. ఇదిలా ఉంటే ధ్రువపత్రాల పరిశీలనకు ఈ రోజు చివరి తేదీ కావడంతో ఆ గడువును ఒకట్రెండు రోజులు పొడిగించే అవకాశం ఉంది.