తెలంగాణలోని సైబరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో షార్ట్‌సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దీంతో రోగులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆస్పత్రిలో ఉన్న వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. సైబరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ హోలిస్టిక్ హాస్పిటల్లో నిన్న అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు, దట్టమైన పొగ అందరినీ భయాందోళనకు గురి చేసింది. ఆసుపత్రి మొదటి అంతస్తులో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
రాత్రి దాదాపు 11:30 గంటల ప్రాంతంలో సమాచారం అందుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అప్రమత్తమైన స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనడంతో 30 మంది రోగులను భవనం నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఆసుపత్రి సిబ్బంది రోగులను ఇతర హాస్పిటళ్లకు తరలించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక భద్రతా విభాగం, స్థానికులు త్వరగా స్పందించడం, వేగవంతంగా చర్యలు చేపట్టడంపై పెద్ద ఎత్తున్న ప్రశంసలు వస్తున్నాయి.