జన్నారం, (ప్రభ న్యూస్) : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ విద్యానగర్ కాలనీలో దాసరి సత్యనారాయణ ఇంట్లో నివాసముంటున్న పి.లక్ష్మణ్ వంట గదిలో గ్యాస్ సిలిండర్ పైపు లీకేజీ కావడంతో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న స్థానిక స్టేషన్ ఫైర్ అధికారులు డి.శ్రీనివాస్, లీడింగ్ ఫైర్‌మెన్ పి.రవీందర్‌రెడ్డి, ఫైర్‌మెన్ ఎంబడి మహేందర్, కె.భువనచంద్ర, డ్రైవర్ పి.రమేష్, హోంగార్డు టి.శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. దీంతో ఇంటి యజమాని, అద్దెకుంటున్న లక్ష్మణ్, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఈ సందర్భంగా అగ్నిమాపక అధికారి మాట్లాడుతూ… గ్యాస్ సిలిండర్‌ను ఎప్పుడైనా కింద పెట్టి స్టవ్ ను ఎత్తులో పెట్టాలన్నారు. ప్రతిరోజూ వంట చేసిన వెంటనే సిలిండర్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలని ఆయన సూచించారు. గ్యాస్ సిలిండర్ నేలపై పెట్టడం, పైపు నుంచి గ్యాస్ లీక్ కావడంతో మంటలు వ్యాపించడంతో ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.10 వేల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.