పెద్దపల్లి రూరల్, జులై 4(ప్రభ న్యూస్): పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైల్వే స్టేషన్ వద్ద మరో సారి పెనుప్రమాదం తప్పింది. మంగళవారం గోదావరిఖని నుండి నిజామాబాద్ 61 బోగీల్లో బొగ్గుతో వెళుతున్న వ్యాగన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వ్యాగన్ లోని బోగీలో బొగ్గులో వేడి ఉత్పతై మంటలు చెలరేగాయి. గమనించిన రైల్వే సిబ్బంది స్టేషన్ లో గూడ్స్ రైలు నిలిపి పెద్దపల్లి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు.
ఫైర్ అధికారి దేవనంది శ్రీనివాస్, లీడింగ్ ఫైర్ మెన్ సిరాజొద్దిన్, డ్రైవర్ ఆపరేటర్ చంద్రయ్య, ఫైర్ మెన్ శ్రావణ్ కుమార్, నరేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. దీంతో పెను రైలు ప్రమాదం తప్పింది. ఇటీవల పొలాల్లో మంటలు రైల్వే స్టేషన్ వైపు వ్యాపించగా సిగ్నల్ వ్యవస్థ, ఆగి ఉన్న పెట్రోల్ ట్యాంకర్ల రైలుకు అంటుకోకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. మళ్ళీ రాఘవపూర్ స్టేషన్ వద్ద గూడ్స్ రైలు బోగిలోని బొగ్గు మంటలు అంటుకోవడం, సకాలంలో ఆర్పివేయడంతో మరోసారి పెను ప్రమాదం తప్పింది. రైల్వే పోలీసులు, అధికారులు, సిబ్బంది పర్యవేక్షించారు.