హైదరాబాద్: పశుసంవర్థక శాఖ కార్యాలయంలో దస్త్రాలు మాయం కేసులో తలసాని మాజీ ఓఎస్డీ కల్యాణ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. ఈనెల 9న తనపై నాంపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
దీనిపై వివరణ ఇవ్వాలని కోరుతూ పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను ఈనెల 16కి వాయిదా వేసింది. మాసబ్‌ట్యాంక్ పశుసంవర్థకశాఖ కార్యాలయంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ ఛాంబర్ ఉంది. డిసెంబర్ 8న సాయంత్రం కిటికీ గ్రిల్స్ తొలగించి కొందరు కార్యాలయంలోకి ప్రవేశించారు. అక్కడి నుంచి కీలక పత్రాలు, కంప్యూటర్లలోని హార్డ్‌డిస్క్‌లు ఎత్తుకెళ్లినట్టు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు హల్చల్ చేశాయి. అదే రోజు రాత్రి అక్కడ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న ఎం.లక్ష్మయ్య ఆ కార్యాలయ తాళాలు తీసి ఉండటం గమనించారు. అనుమానం వచ్చి చూడగా లోపల ఫైళ్లు, కంప్యూటర్లు, బీరువాలు చిందరవందరగా కనిపించాయి..
. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్, కంప్యూటర్ ఆపరేటర్ మోహన్, ఎలీజాన్, వెంకటేష్, మరో ఇద్దరు ఎటువంటి అనుమతి లేకుండా కార్యాలయంలోకి ప్రవేశించారని లక్ష్మయ్య నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కొన్ని పత్రాలు మాయమయ్యాయని పశుసంవర్థకశాఖ అధికారులు మధ్య మండలం డీసీపీ శ్రీనివాస్‌కు తెలపగా.. ఆయన కార్యాలయాన్ని పరిశీలించారు