Tuesday, November 26, 2024

రైల్వేకు సంక్రాంతి క‌ళ‌.. ప్రీ బుకింగ్ తో నిండిన బెర్త్ లు..

ప్ర‌భ‌న్యూస్ : కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో క్రమక్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా తర్వాత వస్తున్న పండగలు రవాణా సంస్థలకు కాసులు పండిస్తున్నాయి. రెండేళ్ళుగా స్వంతూళ్ళకు వెళ్ళనివారంతా పండుగల కోసం గ్రామాలకు తరలి వెళ్తుండటంతో రవాణా సంస్థలకు భారీ డిమాండ్‌ పెరిగింది. దసరాకు టీఎస్‌ఆర్‌టీసీకి భారీ కలెక్షన్‌ వచ్చింది. అదనపు చార్జీలను వసూలు చేయనప్పటికీ ఆర్టీసీ రికార్డు స్థాయి ఆదాయాన్ని రాబట్టింది. ఈ ఏడు సంక్రాంతి పండుగ రైల్వేకు మంచి ఆదాయాన్ని సమకూర్చి పెట్టనుందన్న విషయం స్పష్టమవుతోంది.

సంక్రాంతికి ఊరెళ్ళాలనుకున్న వారిలో చాలా మంది అప్పుడే రైలు టికెట్లను రిజర్వ్‌ చేసుకోవడంతో సాధారణ రైళ్ళన్నీ ఫుల్‌ అయ్యాయి. ఐఆర్‌సీ టీసీ సైట్‌ను పరిశీలిస్తే సంక్రాంతి సీజన్‌లో ఏ రైలులోనూ బెర్త్‌లు ఖాళీ కనిపించడం లేదు. ప్రధానంగా ఏపీ వైపు వెళ్ళే బెర్త్‌లన్నీ నిండుకున్నాయి. జనవరి 9 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించడంతో ప్రయాణికులు ముందుగానే అప్రమత్తమై ప్రయాణ ఏర్పాట్లలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

ఏపీ వైపు వెళ్ళే గోదావరి, గౌతమి, గుంటూరు, విశాఖపట్టణం, ఫలక్‌నుమా, ఎల్‌టీటీ, కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు గరీబ్‌రథ్‌ వంటి రెగ్యులర్‌ రైళ్ళలో ఖాళీలేవీ లేకపోవడంతో ప్రత్యేక రైళ్ళను ఎప్పుడు ప్రకటిస్తారు, టికెట్‌ బుకింగ్‌లను ఎప్పుడు ప్రారంభిస్తారన్న ఆసక్తితో పలువురు ఉన్నారు. కొన్ని రైళ్ళలో వెయిటింగ్‌ లిస్ట్‌ 100 వరకు కనిపిస్తోంది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్టణం, ఉత్తరాంధ్ర జిల్లాలు, కాకినాడ, నరసాపురం వైపు వెళ్ళే రైళ్ళ టికెట్లకు కూడా భారీ డిమాండ్‌ నెలకొంది. అదే విధంగా ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి వెళ్ళాలనుకునే వారికి టికెట్లు దొరకడం గగనంగా మారింది. ఒడిషా, బెంగాల్‌కు వెళ్ళే రైళ్ళకూ వెయిటింగ్‌ లిస్ట్‌ మొదలైంది. పూణే, ముంబై, బెంగళూరు, చెన్నై వంటి ఇతర నగరాలకు వెల్ళే వారు సైతం ప్రయాణాలకు సన్నద్దం కావడంతో ఆయా రూట్లలో వెళ్ళే రైళ్ళన్నీ ఫుల్‌ అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement