Tuesday, November 26, 2024

మన సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలే.. మంత్రి త‌లసాని

మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. శనివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా పీపుల్స్ ప్లాజాలో ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి చిన్నారులకు కైట్ లను పంపిణీ చేసి కైట్ ను ఎగుర వేశారు. అనంతరం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజలు
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జనవరి నెలలో ముందుగా వచ్చే పండుగ సంక్రాంతి అన్నారు.
సంక్రాంతి అంటే మూడు రోజుల పాటు ఆనందంగా జరుపుకునే పండుగ అని చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న, రాష్ట్ర ప్రజలు పాడి పంటలు, ఆయురారోగ్యాలతో, సంతోషంగా జరుపుకోవాలని కోరారు. సంక్రాంతి వచ్చిందంటే ఆడపడుచులు రంగు రంగుల ముగ్గులతో తమ ఇంటి ముంగిళ్ళను అలంకరించి గొప్పగా చేసుకుంటారన్నారు. అబ్బాయిలంతా గాలి పటాలతో వేడుకలు జరుపుకుంటారని పేర్కొన్నారు. తమ చిన్నతనంలో పండుగను అందరం కలిసి జరుపుకునే వారమని, ఇప్పుడు పండుగ సందడి అంతగా కనిపించడం లేదన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాలను, పండుగల గురించి చెప్పాలని, వాటిని పరిరక్షించాలని కోరారు. మన సంస్కృతి, ఆచారాలు, పండుగల విశిష్టతను తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ కైట్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం కూడా భారీ ఎత్తున ఈ వేడుకలను నిర్వహిస్తామని మంత్రి చెప్పారు. మన పండగలను మరింత గొప్పగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. నీటి వనరులు పుష్కలంగా అందుబాటులోకి రావడం, 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరాతో రాష్ట్రంలో విస్తారంగా పంటలు పండుతున్నాయని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాంపల్లి నియోజకవర్గ ఇంచార్జి ఆనంద్ గౌడ్, గోషామహల్ నియోజకవర్గ నాయకులు ఆనంద్ గౌడ్, నాయకులు బాలరాజ్ యాదవ్, శైలేందర్, బాక్సర్ అశోక్, శ్రీనివాస్, తలసాని మహేష్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, వెంకటేష్ రాజు, లక్ష్మీపతి, శ్రీహరి, శేఖర్, అబ్బాస్, రజాక్, గజ్జెల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement