తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ పండుగ, నవవాత్రి ఉత్సవాలు ఘటనంగా కొనసాగుతున్నాయి. ఊరూరా శోభాయమానంగా ఆడపడుచులు అంతా కలిసి కన్నుల పండువగా వేడుకలు జరుపుకుంటారు. మహిళలంతా ముస్తాబయి ఒకే చోట చేరి బతుకమ్మ ఆట పాటలతో ఆనందంగా జరుపుకుంటున్నారు. అయితే బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజైన ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అలిగిన బతుకమ్మగా పిలుస్తారు.
పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందని పూరాణ గాధ ఉంది.. అందుకని ఇవాళ బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కావున ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. ఇవాళ బతుకమ్మకు నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. దీంతో ఇవాళ ఆడపడచులందరూ కలిసి బతుకమ్మ అలక తీరాలని ప్రార్థిస్తారు. ఇక మళ్లీ ఏడోనాడు నుంచి అంగరంగ వైభవంగా బతుకమ్మ కొనసాగుతుంది… కాగా.. దుష్ట సంహారం కోసం నడుం బిగించిన అమ్మవారికి మేమంతా తోడుగా ఉన్నామని మహిళలు అందరూ ఆటపాటలతో.. చప్పట్లతో తోడుగా నిలుస్తారు. ఉత్సాహపరుస్తారు.