హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు అంశం ఎంతకీ తెగడంలేదు. ఇప్పటికే రెండు సార్లు కాలేజీలతో సంప్రదింపులు జరిపి తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) నిర్ణయించిన ఫీజులను తాము ఒప్పుకునేది లేదని కొన్ని కాలేజీలు తెగేసి చెప్పేశాయి. దీంతో మరోసారి ఆయా కాలేజీలకు అధికారులు హియరింగ్(విచారణ)కు పిలవనున్నారు. ఏ కాలేజీలైతే ఒప్పుకోలేదో ఆయా కాలేజీలతో రేపు(సోమవారం) మరోసారి భేటీ అయి ఫీజులను ఖరారు చేయనున్నారు. 2019-2022 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించిన ఫీజుల గడువు ఈ విద్యా సంవత్సరంలో ముగియడంతో 2022-25 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించి కొత్త ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే టీఏఎఫ్‌ఆర్‌సీ జులై నెలలో ఇంజనీరింగ్ కాలేజీలను హియరింగ్‌కు పిలిచి ఫీజులను ఖరారు చేసింది. కనిష్ట ఫీజు రూ.45 వేలు కాగా గరిష్ట ఫీజును 1.73 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ ఒక్క ఏడాది మాత్రం గత 2019-22 బ్లాక్ పిరియడ్‌కు సంబంధించిన ఫీజులనే వసూలు చేయాలని మిగతా రెండేళ్లు టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులను వసూలు చేయాలని అనధికారికంగా కాలేజీలకు ఆదేశాలివ్వడంతో దీన్ని ఒప్పుకోని దాదాపు 81 కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. అయితే ముందస్తుగా నిర్ణయించిన ఫీజులకు కోర్టు అనుమతులు ఇవ్వడంతో ఆ ఫీజులనే వసూలు చేసుకున్నాయి. ఫీజులు పెరగడంపై విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో మరోసారి ఫీజుల ఖరారుపై ఈనెలలో దాదాపు 93 కాలేజీలతో హియరింగ్ జరిపిన అధికారులకు అడిట్ రిపోర్టుల్లో తప్పులు దొర్లినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో గతంలో దానికంటే ఫీజులు చాలా కాలేజీల్లో తగ్గాయి. దాదాపు 80 కాలేజీల్లో ఫీజులకు కోత పడినట్లు తెలిసింది. గతంలో 40 కాలేజీల్లో లక్ష దాటిన ఫీజులు…ప్రస్తుతం 12 కాలేజీల్లో మాత్రమే ఫీజులు రూ.లక్ష దాటాయి.
చివరగా కనిష్ట వార్షిక ఫీజు రూ.45 వేలు కాగా, గరిష్ట ఫీజు 1.60లక్షలుగా ఖరారు చేశారు. జులైలో సీబీఐటీలో అత్యధికంగా రూ.1.73 లక్షల ఫీజును నిర్ణయించగా ప్రస్తుతం రూ.1.12 లక్షలకు తగ్గించినట్లు తెలిసింది. అంటే దాదారు రూ.61 వేల ఫీజు తగ్గింది. ఇలాగే చాలా కాలేజీల్లో తగ్గాయి. కాలేజీల వద్ద సర్‌ప్లస్ బడ్జెట్ ఉండడం తదితర కారణాలతో ఫీజులను తగ్గించినట్లు అధికారులు చెప్తున్నారు. అయితే సీబీఐటీ, అనురాగ్, నారాయణమ్మ, వర్థమాన్, శ్రీనిధి, మల్లారెడ్డి, విఎన్‌ఆర్ విజ్ఞాన్ జ్యోతి తదితర 25 కాలేజీలు టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజులకు అంగీకారం తెలపలేదని అధికారులు చెప్పారు. ఫీజులను పెంచాలని అధికారులకు ఆయా కాలేజీలు కోరినట్లు తెలిసింది. ఈక్రమంలోనే మరోసారి వీరితో ముఖాముఖి భేటి అయి ఫీజులను ఖరారు చేయనున్నట్లు టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్ స్వరూప్ రెడ్డి విలేకరులతో చెప్పారు. ఆ తర్వాతే ఫీజులకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపనున్నారు. వీటిని ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి.