హైదరాబాద్ – ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్ తెలంగాణలో మరో భారీ పెట్టుబడులను ప్రకటించింది. ఫాక్స్‌కాన్ ఇంటర్‌కనెక్ట్ టెక్నాలజీ (ఎఫ్ఐటీ) డైరెక్టర్ల బోర్డు తెలంగాణలో $400 మిలియన్ల పెట్టుబడికి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని ఫాక్స్‌కాన్ ఇండియా ప్రతినిధి వి లీ ధృవీకరించారు. గతంలో ఫాక్స్‌కాన్ తెలంగాణలో $150 మిలియన్ల పెట్టుబడులను ప్రకటించగా, ఇప్పుడు ప్రకటించిన పెట్టుబడి దీనికి అదనంగా రానుంది.
ఈ సందర్భంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ, తమ వాగ్దానాలను నెరవేర్చడానికి ఫాక్స్ కాన్ సిద్ధంగా ఉందన్నారు. ఫాక్స్ కాన్ గ్రూపుతో తమ స్నేహం స్థిరంగా ఉందని తెలిపారు. ఈ పెట్టుబడులు తెలంగాణ అభివృద్ధిని రుజువు చేస్తున్నాయని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
ఇది ఇలా ఉంటే రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ తయారీ ప్లాంట్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ యూనిట్లో రూ.1,656 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఫాక్స్ కాన్. ఈ నిర్మాణ పనులకు మే 15న కేటీఆర్ భూమి పూజ చేసిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదిలో ఈ ప్లాంట్ లో కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి..