హైదరాబాద్, (ప్రభ న్యూస్) : పాదర్స్ డే రోజున టీ-ఎస్‌ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించిందని, ఐదేళ్లలోపు పిల్లలతో ప్రయాణించే తండ్రులు ఉచితంగా ప్రయాణించవచ్చని టీ-ఎస్‌ఆర్టీసీ సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, వైస్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ తెలిపారు. నాన్న గొప్పతనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తన జీవితాన్ని పిల్లల కోసం ధారపోసి.. ఎప్పుడూ వెన్నంటే ఉండి నడిపిస్తాడు నాన్న. అందరి జీవితంలో రోల్ మోడల్‌గా నిలిచే పాదర్స్ డే సందర్భంగా నాన్నలకు టి.ఎస్.ఆర్టీసీ బోనాంజా ప్రకటించింది. 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలతో ప్రయాణించే తండ్రులందరికీ అన్ని బస్ సర్వీసులలో అంటే పల్లె వెలుగు నుంచి ఏసీ సర్వీసుల వరకు ఏ బస్సులో అయినా ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తుంది.
టి.ఎస్.ఆర్టీసీ ముందుగా ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెబుతూ… ఈనెల 19న ఆదివారం రోజు తండ్రులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని వెల్లడించింది. కుటుంబ సంరక్షకుడిగా నాన్న పోషించే పాత్రను వెలకట్టలేమంటూ ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యే, వైస్ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్, ఐ.పి.ఎస్ వారి నిస్వార్థ సేవల్ని కొనియాడారు. ప్రేమించటం అమ్మ వంతైతే దీవించటం నాన్న వంతు అని అభివర్ణిస్తూ… అందరి జీవితాల్లో తండ్రి మార్గనిర్ధేశకులుగా నిలుస్తారన్నారు. వారి సేవలకు గుర్తింపుగా పాదర్స్ డే రోజున వారికి ప్రత్యేకంగా ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఐదేళ్ల లోపు పిల్లలతో ప్రయాణించే నాన్నలు ఈ ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.