కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన 161వ జాతీయ రహదారి మద్నూరు మండలం మెనూరు వద్ద సోమవారం జరిగింది. మద్నూరు నుంచి బిచ్కుంద వైపు జాతీయ రహదారిపై రాంగ్‌రూట్‌లో వెళ్లే ఆటో లారీని ఢీకొట్టింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి గుజరాత్ వైపు కంటైనర్ లారీ వెళ్తున్నది. రెండు వాహనాలు వేగంగా ఉండడంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది.
ఈ యాక్సిడెంట్‌లో లారీ ముందుభాగంలోకి ఆటో చొచ్చుకువెళ్లింది. దీంతో ఆటోలో ఎందరున్నారు? ఎంతమంది చనిపోయారు? అనే వివరాలు పూర్తిగా తెలియడం లేదు. ఆరుగురి మృతదేహాలు మాత్రం బయటకు కనిపిస్తున్నాయని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆటోను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆటో రాంగ్‌రూట్‌లో వేగంగా రావడంతో పాటు అదే సమయంలో కంటైనర్ వేగంగా ఉండడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉందని పోలీసులు తెలిపారు.
అయితే, మృతులకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. ఆటో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందన్న విషయాలు తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం పోలీసులు మృతులకు సంబంధించిన ఫోన్ల ద్వారా.. అందులో డయల్ చేసిన నంబర్ల ద్వారా మృతులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.